భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం శుక్రవారం కనుల పండువగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణం పూర్తిచేశారు.
రేపు శ్రీరామాత్మక వరుణయాగం
శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం శ్రీరామాత్మక వరుణయాగం నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్‌రావు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన సమృద్ధిగా వర్షాలు కురిసి రాష్ట్రం పాడి పంటతో సుబిక్షంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వం, వైదిక పెద్దల సూచనల మేరకు ఈ యాగం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం ఉదయం 8–30నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు యాగం ఉంటుందని తెలిపారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి శుక్రవారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన చేశాక హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. పూజల్లో ఆలయ ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
పైలట్ ప్రాజెక్టుగా
మూడు జీపీలు
మల్లారంలో పరిశీలించిన
పంచాయతీరాజ్ శాఖ డీసీ
పినపాక: రాష్ట్రంలో అన్ని పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు కేటాయిస్తోందని పంచాయతీ శాఖ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా పినపాక మండలం మల్లారం, అశ్వరావుపేట మండలం నారంవారిగూడెం, దుమ్ముగూడెం మండలంలోని బి.కొత్తగూడెంను ఎంపిక చేశామని వెల్లడించారు. ఇందులో భాగంగా మల్లారంలో శుక్రవారం పర్యటించిన ఆయన అభివృద్ధి పనులు, ప్రణాళికలపై డీపీఓ అనూష, ఎంపీడీఓ సంకీర్తతో చర్చించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసే ప్రతీ రూపాయిని సద్వినియోగం చేసుకుంటే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ఈ–బయ్యారంలో నిర్మాణం పూర్తయిన జీపీ భవనాన్ని పరిశీలించగా, కొత్తగా ఏర్పడిన అన్ని జీపీలకు భవనాలు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఈకార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వరరావు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రామాలయంలో అన్నదానానికి
రూ.6లక్షల విరాళం
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన కొనసాగుతున్న నిత్య అన్నదానానికి ఇద్దరు భక్తులు గురువారం రూ.6 లక్షల విరాళం అందజేశారు. విజయవాడకు చెందిన మహేందర్ చౌదరి తన మనవడు సుంకర వేదాంత్ కార్తీక్ పేరుపై రూ.5,00,005, అమెరికాకు చెందిన నల్లమోతు గాయత్రి రూ.లక్ష విరాళం చెక్కులను అధికారులకు అందజేశారు. అనంతరం దాతలు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వీరికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.


