ఆ ఒక్కటీ అడక్కు.. | - | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కటీ అడక్కు..

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

ముందుకు సాగేదెలా?

సింగరేణి – జెన్‌కో అధికారుల

సంయుక్త సమావేశం

బొగ్గు ఉత్పత్తి పెంపు, భవిష్యత్‌

అవసరాలపై విస్తృత చర్చ

కీలకమైన బకాయిల అంశంపై

మాత్రం మౌనం

జెన్‌కో నుంచి సింగరేణికి

దక్కని హామీ?

కొండలా బకాయిలు

టీజీ జెన్‌కో ఆధ్వర్యాన కేటీపీఎస్‌ (కొత్తగూడెం), బీటీపీఎస్‌ (మణుగూరు), కేటీపీపీ (భూపాలపల్లి), వైటీపీసీ (నల్లగొండ, దామరచర్ల) వంటి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. ఏటా ఈ కేంద్రాలకు లక్షల టన్నుల బొగ్గును సింగరేణి సరఫరా చేస్తోంది. కానీ, ఇందుకు సంబంధించిన బిల్లులను సకాలంలో జెన్‌కో చెల్లించడం లేదు. ఫలితంగా గతేడాది డిసెంబర్‌ నాటికే బకాయిలు రూ.18,828 కోట్లకు చేరాయి. మరోవైపు మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ లో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను టీజీపీసీసీకు అమ్ముతోంది. ఇక్కడి నుంచి కూడా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. దీంతో మొత్తం బకాయిలు రూ.27,328 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.46,206 కోట్లకు చేరుకున్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

ఏడు నెలలుగా..

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఈ ఏడాది జనవరి చివరి వారంలో కొత్తగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా టీజీపీసీసీ, టీజీజెన్‌కో నుంచి రావాల్సిన బకాయిలు తొందరగా వసూలు చేసుకోవాలని, ఇందుకోసం కొంత సడలింపు ఇచ్చయినా ఏకమొత్తంగా సెటిల్‌ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత బకాయిల అంశంపై సింగరేణిలో యాక్టివ్‌గా ఉన్న కార్మిక సంఘాలు ఏప్రిల్‌ 28న హైదరాబాద్‌లోని విద్యుత్‌ సౌధ ఎదుట ధర్నా నిర్వహించాయి. జూన్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి హరీశ్‌రావు సింగరేణిలోని ప్రతీ ఏరియాలో పర్యటించిన సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. దీంతో కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన జెన్‌కో – సింగరేణి ఉన్నతాధికారుల సంయుక్త సమీక్షలో బకాయిల అంశానికి ప్రాధాన్యత దక్కుతుందనే నమ్మకం కార్మిక లోకంలో ఏర్పడింది. రెండు శాఖలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వర్తిస్తుండడంతో ఫలితం ఆశాజనకంగా ఉంటుందని భావించారు.

అదొక్కటి మినహాయించి

పనితీరు మెరుగు పర్చుకోకపోతే బీఎస్‌ఎన్‌ఎల్‌ తరహాలో సింగరేణి చిక్కుల్లో పడుతుందని అధికారుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. రాబోయే కాలానికి తగ్గట్టుగా బొగ్గుతో పాటు రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ వంటి అంశాలపై ఫోకస్‌ చేయాలని.. హైడల్‌, బ్యాటరీ స్టోరేజీ పవర్‌, సోలార్‌, ఫ్లోటింగ్‌ సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల స్థాపనపై దృష్టి సారించాలని తెలిపారు. ఇలా అనేక విషయాలపై కార్యాచరణ సిద్ధం చేసినా కీలకమైన బకాయిల అంశాన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్టు సమాచారం. సింగరేణికి జెన్‌కో చెల్లించాల్సిన బకాయిల విషయంపై అటు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, టీజీ జెన్‌కో సీఎండీ హరీశ్‌ కానీ ఇటు సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, డైరెక్టర్‌ (పా) గౌతమ్‌ పోట్రు, ఇతర డైరెక్టర్లు చర్చకు తీసుకురానట్టు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రెస్‌నోట్‌లోనూ ఈ అంశంపై కనీస ప్రస్తావన లేదా వివరణ కానీ లేకపోవడం గమనార్హం.

పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌, రాజస్థాన్‌లో సోలార్‌ పవర్‌, జైపూర్‌లో పవర్‌ ప్లాంట్‌ విస్తరణ, బ్యాటరీ స్టోరేజీ ఎనర్జీ, సోలార్‌ పవర్‌ ప్లాంట్ల విషయంలో ఇప్పటికే సింగరేణి తరఫున డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. బొగ్గు సరఫరాలో నాణ్యత పెంచాలంటే ముఖ్యమైన గనుల వద్ద కోల్‌ వాషరీ ప్లాంట్లు స్థాపించాల్సి ఉంటుంది. వీటికి కనీసం రూ.12కోట్ల వరకు వ్యయం అవుతుంది. కానీ, సరిపడా నిధులు లేకపోవడం, బకాయిలు వసూలు కాకపోవడంతో గతంలో ఆమోదించిన పనులు ముందుకు సాగడం లేదనేది సంస్థలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఫలితంగా ఇప్పుడు సూచించిన కొత్త పనులు ఎలా తలకెత్తుకుంటారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తెలంగాణకు సింగరేణి ఆత్మ వంటిందని చెబుతూనే.. ఆ ఆత్మకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి గనులను పరిశీలించడమేకాక సింగరేణి, టీజీ జెన్‌కో ఉన్నతాధికారులతో సంయుక్త సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో బొగ్గు ఉత్పత్తి పెంపు, నాణ్యత, పోటీ నేపథ్యాన మెరుగుపర్చుకోవాల్సిన అంశాలపై సూచనలు చేసినా.. బకాయిల అంశానికి కనీస స్థాయిలో ప్రాధాన్యత దక్కకపోవడం ఈ సందేహాలకు బలాన్ని ఇస్తోంది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement