విద్యుత్‌పైనా ఎల్‌నినో ప్రభావం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌పైనా ఎల్‌నినో ప్రభావం

Jul 25 2026 1:05 AM | Updated on Jul 25 2026 1:05 AM

● అప్రమత్తతతో డిమాండ్‌ను అధిగమించడం భేష్‌ ● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

ఐదు గంటల నిరీక్షణ

● అప్రమత్తతతో డిమాండ్‌ను అధిగమించడం భేష్‌ ● రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

మణుగూరుటౌన్‌/రుద్రంపూర్‌: ‘రాష్ట్రంలో వానాకాలం 11 వేల మెగావాట్ల విద్యుత్‌ వినియోగం సర్వసాధారణం. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక వేసవి మాదిరిగా అది 16 వేల మెగావాట్ల డిమాండ్‌ నమోదవుతోంది. ఆశించిన స్థాయిలో జల విద్యుత్‌ ఉత్పత్తి లేకున్నా సింగరేణి, జెన్‌కో సంస్థలు సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి ఇబ్బంది రాకుండా డిమాండ్‌ను అధిగమించడం అభినందనీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, కలెక్టర్‌ అంకిత్‌, పినపాక, భద్రాచలం, వైరా ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్‌నాయక్‌తో కలిసి భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ (బీటీపీఎస్‌)లో యూనిట్ల పనితీరును ఆయన పరిశీలించారు. విద్యుత్‌ ఉత్పత్తి, బొగ్గు వినియోగం, యంత్రాల నిర్వహణ, భద్రతా ప్రమాణా లు, నిర్వహణ వ్యవస్థలపై ఆరా తీశారు. అంతకుముందు కొత్తగూడెంలో సింగరేణి, జెన్‌కో అధికారులతో భట్టి సమావేశమై మాట్లాడారు. విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా పదేళ్ల క్రితమే బొగ్గు గనుల ఏర్పాటుకు సిద్ధం కావాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం అలా చేయలేదన్నారు. ఫలితంగా ఇప్పు డు బొగ్గు అందుబాటులో లేక ఒత్తిడి వస్తోందని తెలిపారు. అయితే, విద్యుత్‌ శాఖ, సింగరేణి సమన్వయంతో ముందుకు సాగుతుండడంతో సమస్య రాలేదన్నారు. ఈ మేరకు రానున్న 20 ఏళ్లలో బొగ్గు లోటు లేకుండా సింగరేణి అదనంగా కోల్‌ బ్లాక్‌లు తెచ్చుకోవడంతో పాటు దేశంలో ఎక్కడ వేలం పెట్టినా పాల్గొనాలని ఆదేశించామని భట్టి తెలిపారు.

సింగరేణి ప్రయోజనాలకే ప్రాధాన్యత

రాష్ట్ర విద్యుత్‌ రంగానికి వెన్నుముకలా నిలుస్తున్న సింగరేణి ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ బొగ్గు ఉత్పత్తి విస్తరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మణుగూరులోని పీకేఓసీ–2ను సింగరేణి, జెన్‌కో సీఎండీలు బుద్ధప్రకాశ్‌ జ్యోతి, హరీశ్‌, కలెక్టర్‌ అంకిత్‌, సింగరేణి డైరెక్టర్లు గౌతమ్‌ పొట్రు, ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా 1976లో ప్రారంభమైన గని చరిత్ర, బొగ్గు వివరాలను జీఎం దుర్గం రాంచందర్‌ వివరించారు. మణుగూరు మనుగడ దృష్ట్యా పీకేఓసీ డిప్‌ సైడ్‌ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించేలా చొరవచూపాలని అధికారులు కోరా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లోని అన్ని బ్లాకులు సింగరేణికి రావాలనేదే ప్రభు త్వ ఆకాంక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జెన్‌కో డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, అజయ్‌, బీటీపీఎస్‌ సీఈ బిచ్చన్న, కార్పొరేట్‌ జీఎం వెంకటరమణ, అధికారులు వెంకట రామారావు, రమేశ్‌, రాంబాబు, మదన్‌నాయక్‌, శ్రీనివాసచారి, దయాకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక సంఘాల నిరసన

మణుగూరుటౌన్‌: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పీకేఓసీ వ్యూ పాయింట్‌ వద్ద డీప్‌సైడ్‌ బ్లాక్‌ ఆవశ్యకతను వివరించేందుకు రెండు రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచే ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు వేచి ఉండగా, మధ్యాహ్నం 3.30 గంటల సమయాన తొలుత వ్యూ పాయింట్‌ వద్దకు వెళ్తున్న కాన్వాయ్‌ను వెనక్కి మళ్లించిన అధికారులు కోల్‌ బెంచ్‌ వద్దకు తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూడా కార్మిక సంఘాలను కలవకుండానే వెనుదిరిగారు. దీంతో ఇరు యూనియన్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీతో పాటు ఐఎన్‌టీయూసీ నాయకులు సింగరేణికే మణుగూరు ఓసీ డిప్‌ సైడ్‌ బ్లాక్‌ కేటాయించాలని నినాదాలు చేయడం విశేషం.

పినపాక: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమా ర్క బీటీపీఎస్‌ టౌన్‌షిప్‌లోని డీఏవీ హైస్కూ ల్‌ను శుక్రవారం ఉదయం ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నాయకులు, విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకోగా.. ఐదు గంటల ఆలస్యంతో మధ్యాహ్నం రెండు గంటలకు చేరుకుని ప్రారంభించి వెళ్లిపోయా రు. ఐదు గంటలు నిరీక్షిస్తే పది నిమిషాల్లో పర్యటన ముగించుకుని వెళ్లడం గమనార్హం. కాగా, స్కూల్‌ను ప్రారంభించాక చిన్నారులతో భట్టి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement