కమిషనర్ ఆదేశాలతో ఫిర్యాదు
● ఇళ్ల నిర్మాణాలు, విక్రయాల కట్టడిపై దృష్టి ● తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటనలో చర్చ
భద్రాచలం: ఆంధ్రప్రదేశ్‌లోని పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం భూముల రక్షణ కోసం త్వరలోనే ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరపాలని తెలంగాణ దేవాదాయ శాఖ భావిస్తుంది. ఈ అంశాన్ని గురువారం భద్రాచలం వచ్చిన శాఖ కమిషనర్ హన్మంతరావు సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో కమిటీలు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోగా... దేవస్థానం భూముల్లో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. అంతటితో ఆగకుండా అక్రమ నిర్మాణదారులు వాటిని విక్రయానికి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యాన మరో కమిటీ వేసి ఏపీ ప్రభుత్వం చర్చలు జరపాలని నిర్ణయించారు.
పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు
ఇటీవల పురుషోత్తపట్నంలోని రామయ్య భూముల్లో అక్రమ ఇళ్ల నిర్మాణాలు జోరందుకుంది. ఈ మేరకు దేవస్థానం అధికారులు సైతం కొద్ది రోజుల క్రితం సర్వే నిర్వహించారు. కొత్తగా 80కు పైగా నిర్మాణాలను జరిగాయని గుర్తించారు. వీరితో పాటుగా గతంలో ఉన్న వారికి సైతం దేవస్థానం అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా ఆ భూముల్లో నిర్మించిన ఓ ఇంటినివిక్రయానికి పెట్టడం, అందుకు సంబంధించి ప్రకటన దినపత్రికలో ఇవ్వడం చర్చకు దారి తీసింది. అక్రమ నిర్మాణాలు చేపట్టడమే కాక అమ్ముతుండడం దేవస్థానం అధికారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ విషయాన్ని కమిషనర్ హన్మంతరావు దృష్టికి తీసుకెళ్లగా.. అలాంటి వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని ఈఓను ఆదేశించారు. పేపర్ ప్రకటన ఆధారంగా క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సూచించారు. ఇదిలాగే కొనసాగితే పురుషోత్తపట్నంలో రామయ్య భూములు వదులుకోవాల్సిన పరిస్థితి రానున్నందున దేవాదాయ శాఖ అలసత్వం విడనాడాలని భక్తులు కోరుతున్నారు.
కమిటీల ఏర్పాటుతో కాలక్షేపమే
దేవస్థానం తెలంగాణలో ఉండడం, రామయ్య భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఉండడంతో అంతరాష్ట్ర సమస్యగా మారింది. దీనికి తోడు భూముల తమవంటే తమవని ఇటు దేవస్థానం, ఆటు రైతులు వాదిస్తుండడంతో ఎటూ తెగడం లేదు. ఈక్రమాన తెలంగాణ, ఏపీకు చెందిన పలు శాఖల అధికారులతో కమిటీని ఏర్పాటుచేసి రెండేళ్లు దాటినా ముందడుగు పడలేదు. ఇటీవల అక్రమ నిర్మాణాలను గుర్తించిన దేవస్థానం అధికారులు వాటిని తొలగించేందుకు ఏపీకి చెందిన రెవెన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారాలను కోరారు. దీంతో వారు దేవస్థానం అధికారులను బుజ్జగించి ఏపీ తరఫున కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ కమిటీతో కూడా ఫలితం లేదు. ఇలా కమిటీల ఏర్పాటు చేస్తుండగానే ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతుండడం ఆందోళనకు గురి చేస్తుంది. ఏపీ అధికారుల సహకారం లేకుండా తెలంగాణ దేవాదాయ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోందని అధికారులు చెబుతున్నారు.
స్నేహపూర్వకంగానే..
రెండు తెలుగు రాష్ట్రాల పెద్దలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపితేనే ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికై నా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయ శాఖ, రెవిన్యూ, పోలీసు శాఖల సహాయ సహకారంతో శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. తాజాగా దేవాదాయ శాఖ కమిషనర్ హన్మంతరావు బృందంగా ఏపీలో పర్యటిస్తామని వెల్లడించినందున మరోమారు ఆశలు చిగురిస్తున్నాయి.
పురుషోత్తపట్నంలో రామాలయ భూముల్లో ఇప్పటికే అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం. ఏపీకు చెందిన వివిధ శాఖల అధికారుల సహకారం కోరాం. అయితే, వారి నుంచి స్పందన రాలేదు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నిర్మాణాలు చేపట్టిన, విక్రయాలకు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలకు ఫిర్యాదు చేయనున్నాం.
– దామోదర్‌రావు, ఈఓ, రామాలయం


