భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. మూలమూర్తులను దాతలు సమర్పించిన స్వర్ణకవచాలతో ప్రతీ శుక్రవారం అలంకరిస్తారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీరిన స్వామి కి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రాధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పాల్వంచ మండలం కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతంతో అభిషేకం చేసి, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్‌కు అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ రాఘవచార్యుల దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే, జగన్నాథపురం గ్రామానికి చెందిన బానోతు కోట్యి – సాలి దంపతులు అమ్మవారి అలంకరణ కోసం రూ.98వేల విలువైన బంగారు ముక్కెరను ఈఓకు అందజేశారు.
కాలేజీలో ప్రవేశాలు, హాజరుపై దృష్టి
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ జూని యర్ కళాశాలలో ప్రవేశాలు పెంచడమే కాక విద్యార్థులంతా హాజరయ్యేలా అధ్యాపకులు దృష్టి సారించాలని జిల్లా ఇంటర్‌మీడియట్ విద్యాధికారి హెచ్.వెంకటేశ్వరరావు సూచించారు. దుమ్ముగూడెం కాలేజీని శుక్రవారం తనిఖీ చేసిన ఆయన పలు అంశాలపై సూచనలు చేశారు. కాలేజీల్లో నాణ్యమైన బోధనతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలుపై ప్రచారం చేస్తూ ప్రవేశాలు పెంచాలని తెలిపారు. అంతేకాక చేరిన ప్రతీ విద్యార్థి వివరాలు యూ డైస్‌లో నమోదు చేసి క్రమం తప్ప క హాజరయ్యేలా చూడాలని చెప్పారు. ఆతర్వా త విద్యార్థులతో మాట్లాడిన డీఐఈఓ క్రమం తప్పకుండా కళాశాలకు వస్తూ పాఠ్యాంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రిన్సిపాల్ సీహెచ్.కృష్ణవేణి, అధ్యాపకులు వరరాజు,పవన్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టెన్సింగ్ నార్కే పురస్కారానికి
దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇచ్చే టెన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారానికి సాహస క్రీడారంగంలో ప్రతిభావంతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి తెలిపారు. 2023, 2024, 2025 సంవత్సరాల్లో సాహస క్రీడల రంగంలో విశేష ప్రతిభ చూపిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు పూర్తి వివరాలతో https: awards. gov. in వెబ్‌సైట్ ద్వారా ఆగస్టు 20 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పర్వతారోహణ, రాక్ క్లైంంబింగ్, ట్రెక్కింగ్, నదీ, సముద్ర సాహస క్రీడలు, పారా గ్లైౖడింగ్, స్కైడైవింగ్ తదితర సాహస క్రీడల్లో విశేష విజయాలు సాధించిన వారు అర్హులని డీవైఎస్‌ఓ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు.


