రాష్ట్ర ప్రభుత్వం భద్రాచల శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన అభివృద్ధిపై దృష్టి సారించింది. రూ.586 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉపాలయాలకు కూడా మహర్దశ పట్టనుంది. పనులు పూర్తయితే రామయ్య స్వామిని దర్శించుకున్న భక్తులు ఇతర ఆలయాలను కూడా సందర్శించి ఆధ్యాత్మిక వాతావరణంలో సేద తీరే అవకాశం ఏర్పడనుంది. తగిన ప్రచారం చేపడితే భక్తుల రద్దీ, దేవాదాయ శాఖకు ఆదాయం కూడా పెరగనుంది. –భద్రాచలం
భద్రాచల రామాలయ అభివృద్ధిపై ప్రభుత్వ దృష్టి
దేవస్థానానికి అనుబంధంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, శ్రీ అభయాంజనేయస్వామి, శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి, యోగానంద లక్ష్మీ నరసింహాలయం, రంగనాయకుల గుట్టపై రంగనాథ స్వామి, తాతగుడి సెంటర్‌లో గోవిందరాజ స్వామి ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో ధూప, దీప నైవేద్యాలతోపాటు నిత్య పూజలు రామాలయ సిబ్బందే నిర్వర్తిస్తున్నారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా జరుపుతారు. కాగా, ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు తప్ప, ఇతర ఆలయాలకు తగిన ప్రచారం లేదు. దేవస్థానం నుంచి నేరుగా నడిచి వెళ్లేందుకు కనెక్టివిటీ కూడా లేదు. దీంతో భక్తుల ఆదరణ లభించటం లేదు.
తాతగుడి సెంటర్‌లో ఉన్న గోవిందరాజ స్వామి ఆలయంలో మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టేలా దేవస్థానం అధికారులు ప్రణాళికలను రూపొందించాలని భక్తులుకోరుతున్నారు. ప్రస్తుతం ప్రసాద్ పథకంలో భాగంగా టూరిజం హోటల్‌లో నిరుపయోగంగా ఉన్న బ్యాటరీ వాహనాలతోపాటు ఇతర ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయం రామాలయ ప్రాంగణంలో ఉంది. సీతారామ చంద్రస్వామివారిని దర్శించుకున్న భక్తులందరూ అమ్మవారి ని దర్శించుకుంటారు. భక్తులకు ఇక్కడే వేదా శీర్వచనం ఇస్తారు. దసరా వేడుకలు నిర్వహిస్తారు. అభివృద్ధి పనుల్లో ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో తొలగించనున్నారు. ఆలయ ప్రాకారాల ఏర్పాటులో భాగంగా నిర్మాణం వేదిక మారనుంది.
రామాలయం పక్కనే ఉన్న ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం దక్షిణ భాగం విస్తరణకు అధికారులు ప్రతిపాదనలు రూపొందించి దేవాదాయ శాఖకు అందజేశారు. ఉత్తరం దిక్కున శివపార్వతుల ప్రతిమలతో స్వాగతం పలుకుతుండగా, శివరాత్రి, ఇతర ఉత్సవాల రోజుల్లో రద్దీకి అనుగుణంగా ఆలయ ప్రాంగణం సరిపోవటం లేదు. దీంతో దక్షిణ భాగం వైపు విస్తరణతోపాటు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.


