భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. శని, ఆదివా రాలు సెలవురోజులు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి బారులుదీరారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా అంతరాలయంలోని మూలమూర్తులను దర్శించుకున్నారు. కాగా అంతరాలయంలో మూలమూర్తులకు సువర్ణ తులసీ అర్చన జరిపారు. తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.
రోడ్డు భద్రతపై అవగాహన
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తామని, ఇతర శాఖల సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలు చేపడతామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ మేరకు శనివారం వివరాలు వెల్ల డించారు. అరైవ్ అలైవ్–2026లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీవరకు ఆరు రోజు లపాటు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో వాహనదారులు భాగస్వాములు కావా లనికోరారు. హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ప్రాధాన్యత, డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాలను ప్రతి ఒక్కరూ పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే ఎదుటివారి ప్రాణాలతోపాటు, మన ప్రా ణాల ను కాపాడుకోవచ్చని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా, లేకపోయినా వాహనాలను నడిపేటప్పుడు నిబంధనలు పాటించే సివిక్ సెన్స్ కలిగి ఉండాలని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్‌లోడ్ వల్ల కలిగే ప్రమాదాలపై స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని పేర్కొన్నారు. 13న రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాల్లో కమిటీలు, 14న ప్రతిజ్ఞ, బ్లాక్‌స్పాట్ల వద్ద మరమ్మతులు, 15న విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు, 16న పోలీస్‌స్టేషన్లలో ఆటో డ్రైవర్లకు అవగాహన, 17న ప్రథమచికిత్స, 18న ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
వాట్సాప్ ద్వారా
ఇంటర్ ఫలితాలు
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పరీక్ష ఫలితా లను వాట్సాప్ ద్వారా పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా ఇంటర్మీ డియట్ నోడల్ అధికారి వెంకటేశ్వర్లు శనివా రం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వెలువడే ఇంటర్మీడియట్ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను పొందేందుకు ముందుగా 80969 58096 నంబర్‌ను మీ సేవ తెలంగాణగా సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో బీఐఈ ఎగ్జామ్స్ రిజల్ట్ సేవను ఎంపిక చేసి, రోల్ నంబర్, సంవత్సరం (1వ లేదా 2వ సంవత్సరం), స్ట్రీమ్ (జనరల్ లేదా వొకేషనల్) వివరాలను నమోదు చేస్తే వెంటనే ఫలితాల వివరాలు అందుతాయని వివరించారు.


