రూ. 163 కోట్లు అవసరం
● తీరని కలగా మిగిలిన కొత్తగూడెం బైపాస్ రోడ్డు ● పదేళ్లుగా ముందుకు సాగని నిర్మాణ పనులు ● వంతెనల నిధుల కోసం ‘సేతుబంధన్’ ద్వారా ప్రయత్నం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నిత్యం వాహనాల రద్దీ ఉండే జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం రెండేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. బైపాస్ రోడ్‌లో కీలకంగా మారిన భారీ వంతెన నిర్మాణానికి నిధులు అడుగు దూరంలో నిలిచిపోయాయి. జిల్లా కేంద్రం, పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం కార్పొరేషన్ మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఏపీ, ఛతీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు జిల్లా సరిహద్దుగా ఉంది. దీంతో నిత్యం వేలాదిగా భారీ వాహనాలు కొత్తగూడెం–పాల్వంచల మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీనికితోడు స్థానికంగా రోజురోజుకూ కార్లు, ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల రద్దీ కూడా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం–పాల్వంచల పట్టణాల్లోకి భారీ వాహనాలు రాకుండా బైపాస్ రోడ్డు నిర్మించాలనే ప్రతిపాదన 90వ దశకం నుంచి ఉంది. చివరకు 2000–01 ఆర్థిక సంవత్సరంలో కొత్తగూడెం–పాల్వంచలకు బైపాస్ రోడ్డు మంజూరైంది. అలైన్‌మెంట్, స్థల సేకరణ, నిధుల కేటాయింపులో జాప్యం కారణంగా నేటికీ అందుబాటులోకి రాలేదు.
పదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే
ఎట్టకేలకు 2015 నాటికి పాల్వంచ నవభారత్ నుంచి పాత కొత్తగూడెం వరకు ఓ వైపు రోడ్డు నిర్మాణం జరిగింది. ఖమ్మం రోడ్డులో చుంచుపల్లి తండా దగ్గర నుంచి విజయవాడ హైవేపై సీఎంపీఎఫ్ కార్యాలయం వరకు మరోవైపు కూడా రోడ్డు నిర్మాణం పూర్తయింది. మధ్యలో సీఎంపీఎఫ్ కార్యాలయం దగ్గరున్న గోధుమ వాగు బ్రిడ్జి దగ్గర ఒక వంతెన, పాత కొత్తగూడెం వైపు భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి రుద్రంపూర్‌లో ఉన్న సీహెచ్‌పీకి వెళ్లే రైల్వే ట్రాక్‌పై మరో వంతెన నిర్మించాల్సి ఉంది. ఇవి రెండు నిర్మిస్తేనే బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. కేవలం రూ.40 కోట్ల పనులకే పదిహేనేళ్లు పట్టడంతో ఈ వంతెనల నిర్మాణానికి బడ్జెట్ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు
సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఐఎస్‌ఎఫ్)–సేతు బంధన్ పేరుతో రోడ్లపై వంతెన నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తోంది. రైల్వే ట్రాక్‌లు వచ్చిన చోట వంతెన నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. దీంతో తెలంగాణలో 12 చోట్ల రోడ్ అండర్/ఓవర్ బ్రిడ్జిలకు నిధులు కేటాయించాలంటూ 2024–25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రాధాన్యత క్రమంలో కొత్తగూడెం బైపాస్‌లో కీలకమైన గోధుమవాగు, రైల్వేట్రాక్‌లపై వంతెనల నిర్మాణం అంశం మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో ఉన్న నల్లగొండ, ఖమ్మంలోని మధిర వంతెనలకు నిధులు మంజూరయ్యాయి.
సేతు బంధన్ ద్వారా నిధులు విడుదల చేయాలని కోరుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని 2026, మార్చి 3న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. అదే లేఖ ఆధారంగా కిషన్ రెడ్డి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ నెల 10 జరిపే కేటాయింపుల్లో బైపాస్ కల నెరవేరవచ్చనే నమ్మకం కలిగింది. కానీ, అలా జరగలేదు. ప్రస్తుతం మంజూరైన నిధులు 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, త్వరలోనే 2025–26కు సంబంధించిన నిధులు వస్తాయని, అందులో బైపాస్‌కు రూ.163 కోట్ల మేరకు నిధులు మంజూరవుతాయనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే కూనంనేని వ్యక్తం చేస్తున్నారు.


