విద్యార్థుల వివాదాల్లో పెరిగిన ఇతరుల జోక్యం ఇటీవల పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిపై దాడి పోలీసులు జోక్యం చేసుకోవాలంటున్న స్థానికులు
మితిమీరిన ఇతరుల జోక్యం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి ఉమ్మడి రాష్ట్రంలోనే ఘనమైన చరిత్ర ఉంది. కొత్తగూడెంలో ఉన్న సింగరేణి బొగ్గు గనులు, దానికి అనుబంధంగా ఇక్కడ విస్తరించిన, రాబోయే పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించే లక్ష్యంతో 1957లో ఇక్కడ కమ్యూనిటీ పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించారు. తొలుత మైనింగ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో కోర్సులు ప్రారంభమైనా క్రమేపీ ఇతర కోర్సులూ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ కాలేజీలో సివిల్, ఈఈఈ, ఈసీసీ, మెకానికల్, మెటలర్జికల్, మైనింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సులు ఉండగా, మూడేళ్ల కోర్సుకు సంబంధించి అన్ని విభాగాల నుంచి 1,024 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ కాలేజీకి పక్కనే 1962లో ప్రభుత్వం ఐటీఐని ఏర్పాటు చేసింది. ఇక్కడ ఎనిమిది ట్రేడ్‌లలో కలిపి 700 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ రెండు కాలేజీల క్యాంపస్‌లతో రుద్రంపూర్ – రామవరం ప్రాంతాలు కళకళలాడేవి. ఈ కాలేజీల్లో చదువుకున్న వేలాది మంది నేడు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్నత స్థాయిల్లో ఉన్నారు.
తరచూ గొడవలు..
యువ రక్తం ఉప్పొంగే వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఒకే చోట ఉండడంతో సహజంగానే గ్రూపులు ఏర్పడడం, తమ గ్రూప్ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేయడమనేది అన్ని కాలేజీల్లో లాగే ఇక్కడా ఉండేది. అయితే ఇటీవల ఈ గ్రూపు గొడవలు ముదిరి గ్యాంగ్ వార్ దశకు చేరుకుంటున్నాయి. తమ గ్యాంగ్ పైచేయి సాధించేందుకు బయటి వ్యక్తుల సాయం తీసుకునేందుకు కొందరు విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో యువకుల ఆవేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బయటి శక్తులు కూడా ప్రయత్నిస్తున్నాయి. ఫలితంగా ఈ కాలేజీ విద్యార్థులకు సమీపంలో ఉన్న రుద్రంపూర్, గౌతంపూర్, 4 ఇంక్‌లైన్, 3 ఇంక్‌లైన్, రామవరం ప్రాంతాల్లో ఉండే ‘అన్న’లతో టచ్‌లోకి వెళ్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పికెట్ అవసరం
కాలేజీ ప్రతిష్ట, విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ గొడవపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీలో మొదలైన గొడవ నివురుగప్పిన నిప్పులా మారింది. బయటి వ్యక్తులు తమ ఇమేజ్ పెంచుకునేందుకు కాలేజీ విద్యార్థులను తరచుగా రెచ్చగొడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో వార్షిక పరీక్షలు ముగిసే లోగా ‘లెక్కలు తేల్చుకుందాం’ అనే ధోరణి ఇక్కడ పెరుగుతున్నట్టు విద్యార్థులు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయిలో కొత్తగూడేనికి వన్నె తెచ్చిన కాలేజీల ప్రతిష్టకు మచ్చ రాకుండా, ఇక్కడి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కాలేజీలో పరిస్థితిని పరిశీలించి గస్తీ పెంచడం, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైతే పికెట్ ఏర్పాటు చేయాలని రామవరం – రుద్రంపూర్ వాసులు కోరుతున్నారు.
క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల రాక
ఇటీవల పాలిటెక్నిక్ కాలేజీలో క్రీడా పోటీలు జరిగాయి. వందలాదిగా విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడాకారులను ఉత్సాహపరిచే క్రమంలో బయటి వ్యక్తులు కూడా కాలేజీ లోపలికి వచ్చారు. ఈ క్రమంలో ఉత్కంఠగా సాగుతున్న పోరులో గెలిచిన – ఓడిన టీమ్‌ల మధ్య మాటామాటా పెరిగింది. అప్పటికే క్యాంపస్‌లోకి బయటి వారి జోక్యం మితిమీరగా, క్రీడల సందర్భంగా రేగిన చిచ్చు రగులుతూ వచ్చింది. చివరకు ఈనెల 11న కొందరు బయటి వ్యక్తులు కాలేజీ తరగతి గదుల్లో దూరి మరీ ఓ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఆధునిక వసతులు, విశామైన తరగతి గదులతో నాణ్యమైన విద్యను అందిస్తున్న కాలేజీలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా అధ్యాపకులు అప్రమత్తమయ్యారు. కాలేజీ లోపలకు ఇతరులకు స్వాగతం పలికిన కొందరు విద్యార్థులను గుర్తించి మందలించారు. మరికొందరి తల్లిదండ్రులను పిలిపించి విషయం చెప్పారు. దీంతో తాత్కాలికంగా గొడవ సద్దుమణిగింది.


