భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమా చార్యులు, రుగ్వేద పండితులు కేవీకేఎస్ కామేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైదరాబాద్‌లో ఉగాది పురస్కారాలు అందజేసింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, కమిషనర్ హన్మంతరావు చేతుల మీదుగా వారు అవార్డులు అందుకున్నారు.
భద్రగిరి మార్ట్ పనులు పూర్తి చేయాలి
భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్న ‘భద్రగిరి మార్ట్’ అభివృద్ధి పనులను ఈనెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన మార్ట్ పనులను పరిశీలించి మాట్లాడారు. శ్రీరామనవమి నాటికి మార్ట్‌ను ప్రారంభించాల్సి ఉన్నందున పెయింటింగ్, ర్యాక్ ఫిట్టింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిత్యావసర సరుకులు అమర్చాలని చెప్పారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ప్రభాకర్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
ఉగాది సందడి
ఒకరోజు ఆదాయం రూ.20,520
పాల్వంచరూరల్: ఉగాది పర్వదినం సందర్భంగా కిన్నెరసానిలో పర్యాటకులు సందడి చేశారు. మండల పరిధిలోని కిన్నెరసానికి గురువారం జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్ పైనుంచి జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 288 మంది కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.15,920, 100 మంది బోటింగ్ చేయడం ద్వారా టూరిజం శాఖకు రూ.4,600 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
1,020 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 1,020.80 మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 20.20.0.13 కాంప్లెక్స్ ఎరువులు గురువారం చేరాయి. వీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సరఫరా చేయడంతో పాటు కొంత మేర బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు డీఏఓ పుల్లయ్య తెలిపారు.
‘సీ్త్ర జీవిత చిత్రణ’కు
డాక్టరేట్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మంకు చెందిన పెద్దపల్లి తేజస్వికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ లభించింది. ‘తెలంగాణ కథా రచయిత్రులు–సీ్త్ర జీవిత చిత్రణ(1991–2015)’ అంశంపై డాక్టర్ నాళేశ్వరం శంకరం పర్యవేక్షణలో ఆమె పరిశోధనాత్మక గ్రంథానికి డాక్టరేట్ ప్రకటించారు. కాగా, తేజస్వి రాసిన కథలు, పరిశోధనాత్మక వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం కాగా, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లోనూ ఆమె పత్రాలు సమర్పించారు.


