బ్రహ్మోత్సవాలకు శ్రీకారం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు శ్రీకారం

Mar 20 2026 8:04 AM | Updated on Mar 20 2026 8:04 AM

సీతారాముల ఉత్సవ మూర్తులకు అభిషేకం

అర్చకులకు దీక్షా వస్త్రాల పంపిణీ

కల్పవృక్ష వాహనంపై రామయ్యకు తిరువీధి సేవ

రామాలయంలో పరాభవ నామ సంవత్సరాది వేడుకలు

భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం శ్రీకారం చుట్టారు. అర్చకుల వేదమంత్రాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ సాగిన ఈ వేడుకతో భద్రగిరిలో బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ఉదయం మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థబిందెలతో నదీ జలాన్ని తీసుకొచ్చి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. ముందుగా కల్యాణ తంతులో పాల్గొనే రుత్విక్‌లకు, అర్చకులకు దేవస్థానం ఏఈవో శ్రావణ్‌కుమార్‌ దీక్షా వస్త్రాలు అందజేశారు. అనంతరం మూలమూర్తులకు, ఉత్సవ పెరుమాళ్లకు, నిత్యకల్యాణ మూర్తులకు, ఆచార్య, బ్రహ్మ, రుత్విక్‌లకు దీక్షా కంకణధారణ చేశారు.

స్వామి వారికి ఉత్సవాంగ స్నపనం..

అంకురార్పణను పురస్కరించుకుని బేడా మండపంలో స్వామివారికి ఉత్సవాంగ స్నపనం(అభిషేకం) నిర్వహించారు. తొమ్మిది రకాల పండ్ల రసాలు, పంచామృతం, ఇతర నదీ, సముద్ర జలాలతో పాటు పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామి వారికి అభిషేకం గావించాక ప్రత్యేక హారతి సమర్పించారు. సాయంత్రం మత్స్యంగ్రహణం నిర్వహించారు. ఆ తర్వాత వాస్తుహోమం జరిపి యాగశాల ప్రవేశం చేశారు. యాగశాలలో నవధాన్యాలతో అంకురార్పణ, అఖండదీపారాధన చేశారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లను కల్పవృక్ష వాహనంపై కొలువుదీర్చి తాతగుడి సెంటర్‌ వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఈ పూజల్లో స్థానాచార్యులు స్థలశాయి, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement