శిక్షణ కార్యక్రమాలు ఇలా..
● అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు శిక్షణ ● తొమ్మిదో తరగతి వారి నుంచి దరఖాస్తుల ఆహ్వానం ● ఈనెల 31 తుది గడువు
కొత్తగూడెంఅర్బన్: ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచేందుకు భాతర అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) యువికా–26 కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ప్రతీ సంవత్సరం శిక్షణ ఇస్తూ, వారిని శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఇస్రో అధికారులు చర్యలు చేపడుతున్నారు. అంతరిక్ష శాస్త్రం, అనువర్తనాలపై ‘యంగ్ సైంటిస్ట్’ పేరిట యువ విజ్ఞాన కార్యక్రమ్(యువికా) పేరిట నిర్వహించే శిక్షణకు ఈనెల 31లోగా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు 8వ తరగతి మార్కులకు 50 శాతం, అదే తరగతిలో సామాన్య, సాంఘిక మార్కులకు 10 శాతం, ఆన్‌లైన్ క్విజ్ ప్రతిభకు 10, విజ్ఞాన సదస్సు ద్వారా 10, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు 5, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 15 శాతం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు.
2024లో ఓ విద్యార్థినికి అవకాశం..
యువికా – 2024లో కొత్తగూడెం ఎస్‌ఆర్‌డీజీ పాఠశాల విద్యార్థిని బి.రిత్వికకు అవకాశం లభించింది. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రంలో రిత్విక శిక్షణ పొందింది. ప్రస్తుతం ఇంటర్ చదువుతుండగా, భవిష్యత్‌లో శాస్త్రవేత్తగా ఎదిగేందుకు ఇప్పటి నుంచే కష్టపడుతున్నానని తెలిపింది. ఇక యువికా – 2026లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది దరఖాస్తు చేసి, 14 రోజుల శిక్షణకు అర్హత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆకాంక్షిస్తున్నారు.
జిల్లాలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది చక్కటి అవకాశం. శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష పరిశోధన రంగాలపై అవగాహన కల్పించడంతో యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది. అర్హత గల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తులు చేసుకుని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– బి.సంపత్‌కుమార్, జిల్లా సైన్స్ అధికారి
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి ఎంపికై న విద్యార్థులకు మే నెలలో 14 రోజులు శాస్త్ర, సాంకేతిక అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తారు. రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రయోగాత్మక ప్రదర్శన, చాట్, సందర్శన, నిపుణులతో ప్రయోగాలు, ప్రముఖ శాస్త్రవేత్తల అనుభవాలను వివరించనున్నారు. అంతరిక్ష విజ్ఞానం, రాకెట్ ప్రయోగాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎంపికై న విద్యార్థితో పాటు తల్లిదండ్రుల్లో ఒకరికి, లేదంటే గైడ్ ఉపాధ్యాయుడి ప్రయాణ ఖర్చులను ఇస్రో భరించనుంది. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా కావాలనే ఆశయం ఉన్నా.. సరైన అవకాశాలు లేక చాలా మంది విద్యార్థులు వెనకడుగు వేస్తున్నారు. వారి కలలకు మరింతగా బలం చేకూర్చేలా ఇస్త్రో అవకాశం కల్పించడం పట్ల అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని రూపొందించడం పట్ల తల్లిదండ్రులు సైతం స్వాగతిస్తున్నారు.


