గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
ములకలపల్లి, (అన్నపురెడ్డిపల్లి): ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వ్యక్తి గుండెపోటుకు గురై మృతి చెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రాజాపురం గ్రామానికి చెందిన శనగారపు పుల్లయ్య (55) రోజూలాగానే మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో చాతిలో నొప్పిరావడంతో కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఆటో, బైక్ ఢీ
మహిళ మృతి
చుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల క్రాస్‌రోడ్డు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. టేకులపల్లి మండలం శంభునిగూడేనికి చెందిన దంసలాపురి సక్కుబాయి (45) పాల్వంచ నుంచి ఆటోలో తమ గ్రామానికి వెళ్తుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సక్కుబాయి కింద పడి తలకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆటోడ్రైవర్ కుక్కమూడి బుచ్చిబాబుకు, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహదారుడు నవీన్‌కు స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు విచారణ చేస్తున్నారు.
నలుగురు నిందితులకు రిమాండ్
మణుగూరురూరల్: ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కేసులో నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు మణుగూరు సీఐ నాగబాబు మంగళవారం తెలిపారు. ఈ నెల 13వ తేదీన పోలోజు నవీన, శ్రీరామోజు సుధాకర్‌చారి, కొండగూడూరు జ్యోతి, మల్లిడి భాస్కర్ కలిసి.. అడ్డగర్ల సురేశ్‌ను మాట్లాడాల్సి ఉందని ఇంటికి పిలిపించి, అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు అతడి తల్లి ధనలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సురేశ్ వాంగ్మూలం, ఇతర ఆధారాలను సేకరించి, నిందితులను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ నాగబాబు పేర్కొన్నారు.
పశువుల పట్టివేత
భద్రాచలంఅర్బన్: భద్రాచలం మీదుగా అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్న పశువులను సోమవారం అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు. చర్ల నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బొలేరో వాహనంలో 9 పశువులను తరలిస్తుండగా భద్రాచలం బ్రిడ్జి సెంటర్‌లోని చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. వాహనంలో తనిఖీ చేసి, పశువులను స్వాధీనం చేసుకుని, పాల్వంచ గోశాలకు తరలించారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని టౌన్ పోలీసులు వెల్లడించారు.


