డెలివర్రీ..
కొన్నేళ్లుగా ఎంసీహెచ్‌సీలో
జరిగిన ప్రసవాలు
గైనిక్ విభాగాన్ని పర్యవేక్షించేవారు కరువు సమయపాలన పాటించని వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశం
ప్రసవాల సంఖ్య పెంచుతాం
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. కొన్నేళ్లలో జరిగిన ప్రసవాల సంఖ్య చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియకపోవడంతో ఈ ప్రభావం ప్రసవాలపై పడుతోంది. ఈ విషయం కలెక్టర్ అనుదీప్ దుదిశెట్టి దృష్టికి వెళ్లడంతో ఆయన ఆస్పత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అధికారులతో ఆయన గురువారం సమీక్షించగా.. ప్రసవాలు తక్కువగా నమోదవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇకపై ప్రసవాలపై నిరంతరం పర్యవేక్షించాలని, గైనిక్ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
గత వైభవం లేదు..
సహజంగా హైదరాబాద్ తర్వాత ప్రసవాలకు ఖమ్మం మాతా, శిశు ఆరోగ్య కేంద్రం పెట్టింది పేరు. కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రసవాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఒక నెలలో 1000 ప్రసవాలకు పైగా నిర్వహించిన రికార్డు కూడా సాధించారు. అది గత వైభవం మాత్రమే. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. వైద్య విధాన పరిషత్ నుంచి డీఎంఈ పరిధిలోకి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. గతంలో రోజూ 30కి పైగా ప్రసవాలు నిర్వహించగా, ప్రస్తుతం 20 ప్రసవాలు కూడా చేయడం లేదు. అందుకు కేసీఆర్ కిట్ రద్దు కావటం కొంత వరకు కారణమైనా, ఎక్కువ శాతం పెద్దాస్పత్రికి రావాలంటే గర్భిణులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు మొగ్గు చూపట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో 435, మే 421, జూన్ 352, జూలై 454, ఆగస్ట్ 479, సెప్టెంబర్ 520, అక్టోబర్ 560, నవంబర్ 494, డిసెంబర్ 427, ఈ యేడాది జనవరిలో 394 డెలివరీలు నిర్వహించారు.
పట్టించుకునేవారేరి..
ఖమ్మం మాతా, శిశు ఆరోగ్య కేంద్రానికి ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి గర్భిణులు వస్తుంటారు. కాగా, వైద్య విధాన పరిషత్ ఆధీనంలో ఉన్న సమయంలో అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు ప్రసవాలు చేసేవారు. ఆ సమయంలో పర్యవేక్షణ కూడా ఎక్కువగా ఉండటం, వైద్యులు సమయపాలన పాటించటంతో ఎక్కువ ప్రసవాలు జరిగేవి. అయితే, 2023 నవంబర్ నుంచి పెద్దాస్పత్రి డీఎంఈ ఆధీనంలో వెళ్లగా వైద్య విధాన పరిషత్ వైద్యులను సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులకు సర్దుబాటు చేశారు. తర్వాత డీఎంఈకి సుమారు 10 మంది గైనకాలజిస్టులను కేటాయించడంతో గతం కంటే ఎక్కువ ప్రసవాలు జరుగుతాయని భావించారు. కానీ, పర్యవేక్షణ కొరవడటంతో ప్రసవాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా గైనకాలజీ విభాగాన్ని పర్యవేక్షించాల్సిన అధికారి, కొందరు వైద్యులు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాణం సాగిస్తుండటంతో సమయపాలన కొరవడి, ఆ ప్రభావం ప్రసవాలపై పడుతోంది. అలాగే, కొందరు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తూ రోగులతో గొడవపడుతుండటం కూడా ప్రసవాలు తగ్గటానికి కారణమవుతోంది. ఇప్పటికై నా గైనిక్ విభాగంపై పర్యవేక్షణ పెంచి, గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.
ఏడాది ప్రసవాలు
2022–23 7,325
2023–24 6,972
2024–25 6,077
2025–26
(ఏప్రిల్–జనవరి) 4,480
పెద్దాస్పత్రిలో తగ్గుముఖం పడుతున్న ప్రసవాలు
మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. గతంలో ప్రసవాలు తగ్గటానికి గల కారణాలను విశ్లేసిస్తున్నాం. వైద్యులు సమయపాలన పాటించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రసవాలు పెంచటంలో నిర్లక్ష్యం వహిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
–డాక్టర్ ఎం.నరేందర్,
జిల్లా జనరల్ ఆస్పతి సూపరింటెండెంట్
డెలివర్రీ..


