ఉపాధి పనుల్లో అవకతవకలు
సుజాతనగర్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో పలు అవకతవకలు జరిగినట్లు పాత అంజనాపురం రైతు వేదికలో మంగళవారం జరిగిన ప్రజావేదికలో వెల్లడైంది. ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ.6 కోట్లతో ఉపాధి హామీ పనులు జరిగాయి. వారం రోజులుగా గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ బృందం సర్వే చేపట్టి.. ప్రజావేదికలో వివరాలు వెల్లడించారు. బినామీ పేర్లతో బిల్లుల చెల్లింపులు, పనులు చేయకుండానే చెల్లింపులు జరిగినట్లు డీఆర్పీలు నివేదికలు చదివి వినిపించారు. పనుల డిమాండ్ కోసం కూలీల వద్ద నుంచి ఎఫ్‌ఏలు డబ్బులు ఆశించినట్లు తేలింది. క్యాటిల్ షెడ్లు, గొర్రెల షెడ్ల నిర్మాణాలు చేయకుండానే చేసినట్లు చెల్లింపులు చేశారని, ఒక కుటుంబానికి ఒకే జాబ్ కార్డు ఉండాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కుటుంబాల్లో విచ్చలవిడిగా జాబ్ కార్డులు ఇచ్చారని తెలిపారు. దీంతో సుమారు రూ.13 లక్షల మేర ఈజీఎస్ సిబ్బంది నుంచి రికవరీకి ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ రవి, డీవీఓ రమణ, ఎంపీడీఓ బి.భారతి, ఎస్‌ఆర్‌పీ సుశీల తదితరులు పాల్గొన్నారు.
సుమారు రూ.13 లక్షల మేర రికవరీ


