నవమికి 43 రోజులే..
సీఎం ప్రకటన కోసం
ఎదురుచూపులు..
● ఖరారు కాని భద్రగిరి అభివృద్ధి ప్లాన్ ● సీఎం రేవంత్‌తో శంకుస్థాపనకు సన్నాహాలు ● మాస్టర్ ప్లాన్ ఆమోదిస్తేనే పనులు మందుకు ! ● వచ్చే నెల 4 నుంచి రామయ్య పెళ్లి పనులు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో అతి పెద్ద ఆధ్యాత్మిక పండుగ శ్రీ సీతారాముల కల్యాణం. ఈ మహోత్సవానికి మరో 43 రోజుల గడువు మాత్రమే ఉండగా ఉత్సవాల నిర్వహణ పనులను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న భద్రగిరి అభివృద్ధికి సంబంధించిన పనులకు శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అభివృద్ధిలో ప్రధానమైన మాస్టర్ ప్లాన్‌పై కీలక నిర్ణయం వెలువడాల్సి ఉంది.
అభివృద్ధికి ఇప్పుడిప్పుడే అడుగులు..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రగిరి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మాఢ వీధుల విస్తరణకు భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి ఖాళీ చేయించారు. రెవెన్యూ అధికారులు ఆ భూమిని చదును చేసి 33.50 కుంటలు ఇటీవలే ఆలయ అధికారులకు అందజేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రూపొందించిన నమూనాను పక్కనపెట్టి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వం విడుదల చేసే నిధుల ఆధారంగా నాలుగు బ్లాక్‌లుగా విభజించి ప్లాన్‌ను రూపొందించారు. దీనిపై వైదిక పెద్దల సలహాలు, సూచనలు సైతం స్వీకరించారు. అనంతరం రూ. 350 కోట్ల ప్రతిపాదనలతో దేవాదాయ శాఖ ప్లాన్‌ను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.
శ్రీరామనవమి పనులకు 4న శ్రీకారం..
మార్చి 27న జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం నేపథ్యంలో వచ్చే 4వ తేదీన పసుపు, కుంకుమ దంచి తలంబ్రాలను కలిపే వేడుకతో పనులు ప్రారంభించనున్నారు. ఉత్సవాల నిర్వహణకు కీలకమైన పలు పనులకు రూ.1.50 కోట్ల వ్యయంతో టెండర్లను ఖరారు చేయనున్నారు. ఉగాది రోజున సీఎం, గవర్నర్, ఇతర మంత్రులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తారు. వీటన్నింటికీ మరి కొద్ది రోజులే గడువు ఉండగా మాస్టర్ ప్లాన్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అంటున్నారు. శ్రీరామనవమి రోజున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తీసుకుని రావడం ఆనవాయితీ. ఈ క్రమంలో మార్చి 27న సీఎం రేవంత్‌రెడ్డి రానుండగా ఆ రోజునే ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయించాలని అధికారులు, మంత్రులు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో చివరి క్షణంలో హడావుడి లేకుండా ముందుగానే ప్రభుత్వ నిర్ణయం వెలువడాలని భక్తులు కోరుతున్నారు.
భద్రగిరి అభివృద్ధి పనుల ప్లాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అమోదించాల్సి ఉంది. కాగా ఇటీవల మేడారం జాతర, మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్న సీఎం ఇకనైనా ప్లాన్‌పై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. భద్రగిరిని అయోధ్య కంటే ఉన్నతంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సభల్లో పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం నిర్ణయంపై భక్తులు, స్థానికులు గంపెడాశలు పెట్టుకున్నారు.


