రమణీయంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం రమణీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజేయంద్రప్రసాద్ అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయనకు ఆలయ అధికారులు ప్రొటోకాల్ దర్శనం కల్పించారు.
నిత్యాన్నదానానికి విరాళం
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి భద్రాచలానికి చెందిన వెంకటరమణారావు జ్ఞాపకార్ధం పద్మావతి, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళం అందజేయగా, అధికారులు వారికి రశీదు ఇచ్చారు.
టీ, కాఫీ దుకాణానికి వేలం..
విస్తా కాంప్లెక్స్‌లోని టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ విక్రయ దుకాణానికి బుధవారం వేలం నిర్వహించగా ఒకరు రూ.92 వేలకు దక్కించుకున్నారు. గతేడాది ఈ దుకాణానికి రూ.81,600గా ఉంది. ఇతర షాపులకు కూడా టెండర్లు ఆహ్వానించినా ఎవరూ దాఖలు చేయకపోవడంతో వాటి వేలాన్ని వాయిదా వేసినట్లు ఈఓ దామోదర్ తెలిపారు.
సమ్మెకు దూరంగా ఉండండి..
సింగరేణి కార్మికులకు అధికారుల సూచన
రుద్రంపూర్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సమ్మెను సింగరేణిలో కూడా విజయవంతం చేసేలా వివిధ సంఘాల నాయకులు ప్రచారం చేశారు. అయితే, సంస్థ భవిష్యత్, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల దృష్ట్యా కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యం కోరుతోంది. సమ్మెకు పిలుపునిచ్చిన డిమాండ్లలో సింగరేణి కార్మికులకు సంబంధించినవి తక్కువగా ఉన్నాయని, వీటిని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని చెబుతోంది. అంతేకాక ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో వెనుకబడి ఉన్నందున, సమ్మె చేస్తే మరింత నష్టం జరుగుతుందని అధికారులు సూచించారు. ఒకరోజు సమ్మెతో సంస్థకు సుమారు రూ.76 కోట్ల నష్టం జరుగుతుందని, కార్మికులు వేతన రూపంలో సుమారు రూ.18 కోట్లు కోల్పోనున్నందున సమ్మెకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో సూచించారు.
20 నుంచి కళాభారతి నాటకోత్సవాలు
భద్రాచలంటౌన్: భద్రాచలం జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 20 నుంచి అంతర్రాష్ట్ర నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు ఫౌండర్ సెక్రటరీ అల్లం నాగేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని జీయర్ మఠంలో ఈ ఉత్సవాల కరపత్రాలు, ఆహ్వాన బ్రోచర్లను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్ రావు, ఆర్టీసీ డిపో మేనేజర్ వి. జంగయ్య, తాళ్లూరి పంచాక్షరయ్య, పాకాల దుర్గాప్రసాద్, రాము తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు వేదికగా ఖమ్మం
ఖమ్మం స్పోర్ట్స్: సీఎం కప్ జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగియడంతో వివిధ అంశాల్లో క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈనేపథ్యాన జిల్లాల వారీగా పోటీల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో ఆర్చరీ, బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు ఖమ్మంలో నిర్వహించా లని నిర్ణయించారు. ఈనెల 20నుంచి 22వ తేదీ వరకు ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఇక్క డ జరగనున్నాయి. అలాగే, అథ్లెటిక్స్ పోటీలు హనుమకొండలో, జిమ్నాస్టిక్స్ కరీంనగర్‌లో, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఖో–ఖో, కబడ్డీ, బాస్కెట్‌బాల్, సెపక్‌తక్రా, సైక్లింగ్ పోటీలు మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
రమణీయంగా రామయ్య నిత్యకల్యాణం


