క్రీడలతో స్నేహ సంబంధాలు బలోపేతం
● డీఏఈ డీసీఎస్‌ఈఎం డైరెక్టర్ మహాపాత్ర ● అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
అశ్వాపురం: అణుశక్తి విభాగం యూనిట్లలో ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న క్రీడా పోటీలతో ఉద్యోగుల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం అవుతాయని డైరెక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కె.మహాపాత్ర అన్నారు. స్థానిక గౌతమీనగర్ కాలనీలోని మణుగూరు భారజల కర్మాగారం ఆధ్వర్యంలో భారత అణుశక్తి విభాగం(డీఏఈ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలను డీఏఈ డైరెక్టర్ కె.మహాపాత్ర బుధవారం ఘనంగా ప్రారంభించారు. భారజల కర్మాగారం జీఎం శ్రీనివాసరావుతో కలిసి ఆయన డీఏఈ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ సంవత్సరం నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వివిధ ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుందని చెప్పారు. మణుగూరు భారజల కర్మాగారం ఆధ్వర్యంలో పోటీలకు చేసిన ఏర్పాట్లు, వసతులు, సౌకర్యాలు బాగున్నాయని అభినందించారు. కర్మాగారం జీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారని, వారికి, మేనేజర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతీ ఒక్కరు క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో క్రీడల స్టీరింగ్ కమిటీ కన్వీనర్, డీజీఎం జగన్నాథ శర్మ, డీజీఎంలు రఫీక్ అహ్మద్, మోహన్‌కుమార్, సీఏఈ లక్ష్మీదేవి, ఏడీఎంఓ లత, ఐఆర్‌ఓ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.
8 యూనిట్లు.. 150 మంది క్రీడాకారులు
భారత అణుశక్తి విభాగం(డీఏఈ) ఆలిండియా స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ అథ్లెటిక్స్ పోటీల్లో అణుశక్తి విభాగంలోని 8 యూనిట్ల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ నుంచి గోల్కొండ, నాగార్జున జట్లు, మహారాష్ట్ర నుంచి అజంతా, ఎల్లోరా, గుజరాత్ నుంచి ద్వారకా, ఒడిశా నుంచి కోణార్క్, తమిళనాడు నుంచి రామేశ్వరం, రాజస్థాన్ నుంచి పుష్కర్ జట్లు తలపడనున్నాయి. కాగా, పోటీలు ఈనెల 13న ముగియనున్నాయి. క్రీడోత్సవాల సందర్భంగా అణుశక్తి కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


