ఓటుకు.. పోటెత్తారు
మహిళా ఓటర్లదే పైచేయి
ఖాళీ పోలింగ్ బాక్స్ రావడంతో ఆందోళన
అశ్వారావుపేటలో ఉదయం నుంచే బారులు కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఓటర్ల హడావుడి ఇల్లెందులో 68.56 శాతానికే పరిమితం మహిళా ఓటర్లతో కళకళలాడిన బూత్‌లు
వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలన
అధికారుల తీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో 73.60 శాతం పోలింగ్ నమోదైంది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 డివిజన్లు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోని 46 వార్డుల నుంచి 354 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 288 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
9 గంటల తర్వాత జోరు..
ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా, అశ్వారావుపేటలో అప్పటి నుంచే ఓట్లరు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులుదీరారు. కొత్తగూడెం, ఇల్లెందులో ఆరంభంలో పోలింగ్ కేంద్రాల దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. అయితే, ఉదయం 9 గంటలు దాటిన తర్వాత మూడు చోట్లా పోలింగ్ ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇల్లెందు మినహాయిస్తే మిగిలిన రెండు చోట్లా సగానికి పైగా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఆ తర్వాత పోలింగ్‌లో ఊపు తగ్గింది. చివరకు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మళ్లీ సందడి మొదలైంది. ఐదు గంటల వరకే పోలింగ్ సమయం ముగిసినా ఇంకా పలు కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూలో నిల్చున్నారు. దీంతో వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు.
పేటలో జోరు.. బొగ్గుట్టలో ఆఖరు..
గ్రామపంచాయతీగా ఉన్న అశ్వారావుపేటకు మున్సిపాలిటీ హోదా దక్కిన తర్వాత తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు చురుగ్గా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా, అంతకుముందే బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఇక్కడ మధ్యాహ్నం 3 గంటల సమయానికే 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇక జిల్లాలో సీనియర్ మున్సిపాలిటీగా ఉన్న ఇల్లెందులో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా మొదలై.. ఆ తర్వాత కొంతమేర పుంజుకున్నప్పటికీ చివరికి ఆఖరు స్థానంలోనే నిలిచింది.
తోపులాటలు.. వాగ్వాదాలు
● అశ్వారావుపేట 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోలింగ్ ఏజెంట్ దగ్గరున్న ఓటర్ల జాబితాను బయటకు తీసుకొచ్చారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలుసుకునేందుకు ఈ పని చేయగా, దీనిపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్దిచెప్పి ఇరువర్గాలను వెనక్కి పంపారు.
● కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి ఆరో డివిజన్‌లో తమకు ఎందుకు డబ్బులు పంపిణీ చేయలేదంటూ కొందరు ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రశ్నించేందుకు పోలింగ్ బూత్ దగ్గరకు రాగా వారిని ఆ పార్టీ కార్యర్తలు అడ్డుకునేందుకు ప్రయ్నతించారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పాత పాల్వంచలోని 40 డివిజన్‌కు సంబంధించిన పోలింగ్ కేంద్రం వద్ద బయటి వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, బయటి వ్యక్తులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 19 డివిజన్ (రామవరం)లో సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్పస్థాయిలో తోపులాట జరగగా 52వ డివిజన్ (మేదరబస్తి)లో వాగ్వాదం చోటుచేసుకుంది.
● ఇల్లెందు గర్ల్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లోకి వెళ్లేందుకు బయటి వ్యక్తులు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. మెయిన్‌రోడ్ హైస్కూల్ దగ్గర గులాబీ కండువాలు వేసుకుని నిషేధిత ప్రాంతంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ కార్యర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 13వ వార్డులో సీనియర్ రాజకీయ నేత మడత వెంకట్‌గౌడ్, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. 24వ వార్డులో సామాజిక కార్యకర్త బొల్లం సాల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి మహిళా ఓటర్లు సత్తా చాటారు. ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటింగ్ 73.51 శాతంగా ఉండగా మహిళలు 73.70 శాతం మంది ఓటు వేశారు.
పాల్వంచ: పోలింగ్ సిబ్బంది ఓ ఖాళీ బ్యాలెట్ బాక్స్‌ను బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో అక్కడున్న కొందరు సీపీఐ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. ఖాళీ బాక్స్‌ను వెంటనే పోలింగ్ కేంద్రానికి తరలించాల్సి ఉండగా స్టేషన్‌కు ఎందుకు తీసుకొచ్చారంటూ నిలదీశారు. దీంతో ఎస్‌ఐ నాగరాజు అక్కడికి చేరుకుని పోలీస్ ఎస్కార్ట్‌తోనే ఖాళీ బాక్స్‌ను స్టేషన్‌లో ఉంచారని, అందులో ఎలాంటి అనుమానాలు లేవని, సిబ్బంది వైఫల్యం లేదని తెలిపారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
జిల్లా వ్యాప్తంగా 73.60 శాతం పోలింగ్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో బుధవారం జరిగిన మున్సిపల్ పోలింగ్ ప్రక్రియను ఐడీఓసీ నుంచి కలెక్టర్ జితేష్ వి పాటిల్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ప్రధానంగా పరిశీలించిన ఆయన.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా
పాల్వంచ: పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 7వ డివిజన్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి సింధు తపస్వికి, స్వతంత్ర అభ్యర్థి లోకేష్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో లోకేష్ సింధు తపస్విపై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో సింధు తపస్వి కూడా కేసు పెట్టేందుకు స్టేషన్‌కు రాగా, అక్కడ అధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వేచి ఉండగా.. ఆమెకు మద్దతుగా రేగా కాంతారావు అక్కడికి చేరుకున్నారు. పోలీస్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అక్రమ కేసులు పెడితే సహించేది లేదని, జరిగిన విషయాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి తప్పు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికార పక్షానికి కొమ్ము కాస్తూ ఇతరులను ఇబ్బందికి గురి చేస్తున్నారని, వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు అన్ని లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు వనమా రామకృష్ణ, మల్లెల రవిచంద్ర తదితరులు ఉన్నారు.
ఓటుకు.. పోటెత్తారు
ఓటుకు.. పోటెత్తారు
ఓటుకు.. పోటెత్తారు
ఓటుకు.. పోటెత్తారు


