విచారణ పేరుతో వేధిస్తారా..?
● పోలీసులపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం ● రాత్రి 10 గంటల వరకు స్టేషన్ ఆవరణలో బైఠాయించి నిరసన
పాల్వంచ: దొంగ ఓటు వేసేందుకు వచ్చిందనే అనుమానంతో పోలీసులు ఓ మైనార్టీ మహిళను స్టేషన్‌కు తరలించారు. విచారణ పేరుతో ఆమెను నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచగా, దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్టేషన్ ప్రాంగణంలోనే బైఠాయించారు. వివరాలిలా ఉన్నాయి.. పాత పాల్వంచకు చెందిన ఓ మైనారిటీ మహిళ ప్రస్తుతం కొత్తగూడెంలో నివాసం ఉంటోంది. కాగా, బుధవారం ఓటు వేసేందుకు పాల్వంచలోని 46వ డివిజన్‌లోని పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాల కేంద్రం వద్దకు వచ్చింది. అయితే ఆమె కొంతకాలంగా కొత్తగూడెంలో నివాసం ఉంటుండగా ఇక్కడి ఓటరు జాబితాలో పేరు తొలగించారు. దీంతో ఆమె దొంగ ఓటు వేసేందుకు వచ్చిందని ఆరోపిస్తూ కొందరు పోలీసుల దృష్టికి తీసుకొచ్చి ఆందోళన చేశారు. వెంటనే సీఐ సతీష్‌కుమార్ ఆ మహిళను తమ వాహనంలో స్టేషన్‌కు తరలించారు. విచారణ పేరుతో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచారు. కాగా ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఈ విషయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా దృష్టికి తీసుకురాగా, ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెంటనే స్టేషన్‌కు చేరుకున్నారు.
రాత్రి వరకు బైఠాయింపు..
సీఐతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్టేషన్‌కు రాగా, ఆయన పోలింగ్ విధుల్లో బయటే ఉన్నారని సిబ్బంది చెప్పడంతో వచ్చేవరకు ఉంటానని చెబుతూ తన అనుచరులతో అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సిన వారు ఓ పార్టీకి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరైంది కాదని విమర్శించారు. ఓటర్ లిస్ట్‌లో పేరు లేకుంటే విచారించి పంపించాలే తప్ప ఓ మహిళను అంతసేపు స్టేషన్‌లో ఉంచడం సరైంది కాదన్నారు. చివరకు రాత్రి 10 గంటల సమయాన డీఎస్పీ సతీష్‌తో మాట్లాడి.. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి సీఐపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు.


