సార్వత్రిక సమ్మె సక్సెస్
సింగరేణిలో విధులకు దూరంగా 80 శాతం మంది కార్మికులు
నిలిచిన 1.60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి
స్తంభించిన జీసీసీ సరుకుల రవాణా
రుద్రంపూర్/పాల్వంచరూరల్/కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌తో గురువారం చేపట్టిన సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సంస్థ వ్యాప్తంగా గల 12 ఏరియాల్లో 80 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొనగా అత్యవసర విభాగాలకు చెందిన 20 శాతం మంది మాత్రమే విధులకు హాజరయ్యారని సింగరేణి గణాంకల్లో తేలింది. రెండు షిఫ్టుల్లో కలిపి 32,472 మంది కార్మికులకు గాను 5,446 మంది మాత్రమే హాజరయ్యారు. 432 మంది సెలవులో ఉండగా మిగిలిన 26,598 మంది కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో 1.60 లక్షల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ స్తంభించింది. సమ్మెతో సింగరేణికి సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లగా, కార్మికులు రూ.12 కోట్ల వేతనాలు కోల్పోయారు. కాగా, సార్వత్రిక సమ్మె నేపథ్యంలో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే నిలిపివేయాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, 12 గంటల పని విధానం రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని, కొత్త బొగ్గు బావులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
స్తంభించిన రవాణా..
సార్వత్రిక సమ్మె ప్రభావంతో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) నుంచి సరుకుల రవాణా స్తంభించింది. జీసీసీలోని 20 మందికి పైగా హమాలీలు, కార్మికులు లోడింగ్, అన్‌లోడింగ్ విధులు బహిష్కరించారు. దీంతో పాల్వంచ, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల పరిధిలోని డీఆర్ డిపోలకు, రేషన్ షాపులకు బియ్యంతో పాటు గిరిజన హాస్టళ్లకు సరుకుల సరఫరా నిలిచిపోయింది. జిల్లా విద్యుత్ కార్యాలయం ఎదుట కూడా ఆయా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఉత్పత్తి ధరల నిర్ణయం పంపిణీ మొత్తాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు విద్యుత్ బిల్లు తీసుకొచ్చారని నాయకులు విమర్శించారు. ఇది చాలా ప్రమాదకరమని, రద్దు చేసేవరకు ఐక్యంగా పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సాధినేని వెంకటేశ్వరరావు, వంగా వెంకట్, పీతాంబరం, కంచర్ల జమలయ్య, యర్రగాని కృష్ణయ్య, క్రిస్టఫర్, నరేష్, సుధీర్, భూక్య రమేష్, ఎన్.సంజీవ్, ఎం.మల్లికార్జున్, గుడిల్లి యాకయ్య, విద్యుత్ డీఈ జీవన్‌కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె.బ్రహ్మచారి, వివిధ సంఘాల నాయకులు హేమంత్, రామకృష్ణ, బొల్లి వెంకటరాజు,


