మున్సి‘పోరు’లో విజేత ఎవరో?
గుర్తింపు కార్డులుంటేనే అనుమతి..
అంచనాల్లో మునిగి తేలుతున్న ప్రధాన పార్టీలు
గూడెం, పేటలో ఒకే రౌండ్, ఇల్లెందులో రెండు రౌండ్లలో లెక్కింపు
కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
´ëËÓ…^èlÌZ° Mú…sìæ…VŠæ MóS…{§é°² ç³ÇÖÍçÜ$¢¯]l² MýSÌñæMýStÆŠḥh™ól‹Ù Ñ ´ësìæÌŒ , Gïܵ Æøíßæ™ŒæÆ>k
కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా 354 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,34,775 ఉండగా అందులో 1,00,432 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పాల్వంచ అనుబోస్ కాలేజీలో లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రికార్డు స్థాయిలో 60 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో ఒకే రౌండ్‌లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించిన లెక్కింపు కేంద్రాన్ని 24 ఏరియాలోని కమ్యూనిటీ హల్‌లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 24 వార్డుల్లో 33,723 ఓటర్లు ఉండగా 23,121 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల బరిలో 108 మంది అభ్యర్థులు నిలిచారు. ఇక్కడ 16 టేబుళ్లు ఏర్పాటు చేయగా రెండు రౌండ్లలో ఫలితాలు వెల్ల డయ్యే అవకాశం ఉంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా 76 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 16,850 ఉండగా అందులో 12,849 ఓట్లు పోలయ్యాయి. వ్యవసాయ కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 22 టేబుళ్లు ఏర్పాటు చేయగా ఒకే రౌండ్‌లో ఫలితాలు వెలువడతాయి.
ఓట్ల లెక్కింపును దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 163 చట్టాన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. డీజేల వినియోగం, బాణాసంచా కాల్చడం వంటి సంబరాలనూ నిషేధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్, బాంబుస్క్వాడ్ బృందాలతో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు.
ఒక కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్ని వార్డులు/డివిజన్లలో తమకు గెలుపు దక్కుతుందనే అంచనాల్లో మునిగిపోయాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ – సీపీఐ తమ మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో సర్వశక్తులు ఒడ్డాయి. మెజారిటీ సీట్లు ఈజీగా సాధిస్తామనే ధీమా కాంగ్రెస్‌లో ఉండగా.. మేజిక్ ఫిగర్ తమకు దక్కుతుందనే నమ్మకంతో సీపీఐ ఉంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు దక్కించుకోవాలంటే ఎలాంటి వ్యూహాలు పన్నాలి.. తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను ఎలా కాపాడుకోవాలి.. అనే అంశంపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. అవసరాన్ని బట్టి ఎక్స్ అఫిషియో ఓట్ల వినియోగంపైనా సమాలోచనలు చేస్తున్నాయి.
ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో చైర్ పర్సన్ స్థానం ఆశిస్తున్న అభ్యర్థులు పోటీ చేసిన వార్డులు కీలకంగా మారాయి. పోలింగ్ రోజున ఈ వార్డుల వద్ద మోహరించిన పోలీసు బందోబస్తు, రాజకీయ పక్షాల హడావుడితో ఫలితాలపై మరింత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు డివిజన్లు/వార్డుల నుంచి పోటీలో నిలిచిన అభ్యర్థులు బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, అందులో తమకు పడేవి ఎన్ని, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలను బేరీజు వేసుకునే పనిలో ఉన్నారు. కొందరు అభ్యర్థులైతే లక్షల రూపాయలు ఖర్చు చేసినా, అయిన వారి వల్లే తాము ఓటమి దిశగా వెళ్తున్నామనే దిగులుతో ఉన్నారు.
ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్న వారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు నిషేధిత వస్తువులైన అగ్గిపెట్టెలు, లైటర్, ఇంక్ బాటిళ్లు, పేలుడుకు కారణమయ్యే ఎలాంటి వస్తువులను కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు.
ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు హాట్‌హాట్‌గా మార్చాయి. ఎన్నికల్లో ఫలితాల కంటే ముందే, పోలింగ్ రోజు జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్న హైడ్రామా ఫలితాల కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా చేసింది. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడంతో ఫలితాల వెల్లడికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
–సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


