ప్రయత్నాల్లో ఉమ్మడి జిల్లా నేతలు
అందరి దృష్టి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులపైనే...
ప్రకటనలు వస్తున్నా కదలిక లేక
ఎదురుచూపులు
నామినేటెడ్ పదవులను దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోని ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. కొన్ని రాష్ట్రస్థాయి కార్పొరేషన్, జిల్లాస్థాయి పదవులు భర్తీ అయినా ఇంకా చాలా పోస్టులు మిగిలే ఉన్నాయి. వీటి భర్తీపై ఎప్పటికప్పుడు ప్రకటనలు వస్తున్నా, ఆతర్వాత కదలిక ఉత్సాహంలేక నీరుగారుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు కూడా భర్తీ ప్రక్రియ మొదలుకాకపోవడంతో వేచిచూస్తున్న నేతల్లో నిరాశ నిస్పృహలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఏ పదవి దక్కక సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
ఐదింటితో సరి..
అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఎనిమిదింట కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఈక్రమాన ఇక్కడి కాంగ్రెస్ నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులే కాక జిల్లాస్థాయి పదవులను ఆశించారు. తొలిసారి 2024లో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయి. ఆతర్వాత వ్యవసాయ మార్కెట్లకు పాలకవర్గాలను నియమించారు. అయితే ఇంకా, పలు నామినేటెడ్ పదవులు మిగిలే ఉండగా.. ఆయా పదవులు ఆశిస్తున్న నేతలు ఎక్కువ మంది ఉన్నారు.
ప్రకటనలతో ఉత్సాహం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేయగా.. ఆ తర్వాత తరచూ ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రధాన పండుగలు, ఎన్నికల సమయాన ఈ అంశంపై తెరపైకి వస్తున్నా ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులు నియామకం, గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్చి 15లోగా నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు, ఆశావహులు తమ వంతు ప్రయతాల్లో నిమగ్నమయ్యారు. అయితే, సీఎం చెప్పిన తేదీ దాటినా ఫలితం లేకపోవడంతో ఆశావహులకు మరోమారు నిరాశే నెలకొంది.
రాష్ట్రస్థాయి గుర్తింపు కోసం..
ఉమ్మడి జిల్లాలోని నేతలు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవులవైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా రాయల నాగేశ్వరరావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మువ్వా విజయ్‌బాబు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార ఆర్ధిక సంస్థ చైర్‌పర్సన్‌గా నూతి శ్రీకాంత్‌కు అవకాశం దక్కింది. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకే అత్యధిక పదవులు దక్కగా.. మరికొందరు కూడా గురి పెట్టారు. రాష్ట్రస్థాయి పదవులైతేనే తమకు తగిన గుర్తింపు ఉంటుందనే భావనతో వారు ఉన్నట్లు తెలుస్తోంది.
అధికార పార్టీ నేతలను ఊరిస్తున్న నామినేటెడ్
పదవులు


