అశ్వాపురం: గ్రామాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి గ్రామసభలు కీలకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆయుర్వేద వైద్యశాల ఆవరణలో గురువారం నిర్వహించిన అశ్వాపురం గ్రామసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలుత మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, మందుల గది, వార్డు, ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆ తర్వాత నెల్లిపాకలో కశ్మీర్ ఆపిల్ బేర్ తోటను సందర్శించారు. గొందిగూడెం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో కంప్యూటర్ గదిలో కంప్యూటర్లు అపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంపై వార్డెన్‌పై మండిపడ్డారు. హెచ్‌ఎం, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు జారీచేయాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ మణిధర్, ఎంపీడీఓ ముత్యాలరావు, వైద్యాధికారి సంకీర్తన, ఆయుర్వేద వైద్యాధికారి అరుణ, అశ్వాపురం సర్పంచ్ బాణోత్ సదర్‌లాల్ పాల్గొన్నారు.
భూభారతి అర్జీలు పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని సూచించారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్‌ఓల వారీగా, మండలాల వారీగా విభజించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రీచ్‌ల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు సంజీవరావు, రంగా ప్రసాద్, స్వర్ణలత, దినేష్, యాసిన్ పాల్గొన్నారు.
కలెక్టర్ అంకిత్


