అభివృద్ధికి ప్లాన్ !
ఆలయ నమూనా సిద్ధం
సీఎం ఆమోదమే ఇక తరువాయి
గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే పనులు ప్రారంభం
శ్రీరామ నవమికి సీఎంతో శంకుస్థాపన ?
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. పూర్తి కాగానే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు పంపించనుండగా.. ఆయన ఆమోదిస్తే ఆలయ అభివృద్ధి పనుల ప్రారంభానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే నమూనా, బడ్జెట్, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఈ ఏడాది శ్రీరామనవమి రోజున సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
నవమికి శంకుస్థాపన?
నూతనంగా రూపొందించిన డిజైన్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్‌తో చర్చించారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం అభివృద్ధి నమూనాపై దృష్టి సారించారు. 2027 ఆగస్టులో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పనులు త్వరగా ప్రారంభించి, పుష్కరాల నాటికి భక్తులకు రామయ్య దర్శనానికి ఆటంకం లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్లాన్ తుదిరూపుపై వేగం పెంచినట్లు తెలుస్తొంది. ప్లాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదిస్తే మార్చి 27న శ్రీరామనవమి రోజున ఆయనతోనే శంకుస్థాపన చేయించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా మాఢ వీధుల విస్తరణలో ఇప్పటికే భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించగా, వారికి బ్రిడ్జి సెంటర్‌లో ఉన్న ఆర్‌అండ్‌బీ కార్యాలయ ఖాళీ స్థలాన్ని అప్పగించాల్సి ఉంది.
చర్చనీయాంశంగా అర్చకుల వినతి..
ఆలయ అభివృద్ధికి సంబంధించిన ప్లాన్ సీఎం రేవంత్‌రెడ్డి ఫైనల్ చేసే క్రమాన శ్రీ భద్రాచల సీతారామ అర్చక సంఘం పేరిట అర్చకులు వినతిపత్రం అందించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పలుమార్లు స్తపతి, ఇతర అధికారుల సలహాలు, సూచనలతో ఆలయ అధికారులు ప్లాన్ రూపొందించారు. దీన్ని మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులు ఆమోదించే తరుణాన మరికొన్ని మార్పులను సూచించారు. ప్రధానంగా రెండో ప్రాకారం, దాని నిర్మాణంపై సలహాలు, సూచనలు చేశారు. మహాలక్ష్మి, గోదాదేవి ఆలయాలు గర్భాలయానికి వెనుక, ఉత్తర, దక్షిణ దిక్కులో నిర్మించాలని, ఆలయ ప్రాకారాలకు అవతల ఈశాన్య భాగంలో పుష్కరిణి, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి ఎదురుగా ద్వాదశ మండపం, ఆండాళ్ అమ్మవారి ఆలయానికి ఎదురుగా పౌర్ణమి మండపం నిర్మించాలని కోరారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను సైతం వినతిపత్రంలో ప్రస్తావించారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూపొందించిన డిజైన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టింది. దేవాదాయ శాఖకు చెందిన ఆర్కిటెక్ట్ బృందం, స్తపతి, కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఇటీవల పలుమార్లు భద్రాచలం వచ్చి భక్తులకు అవసరమైన వసతులు, ఆలయ విస్తరణ వంటి పలు పనులను ప్లాన్‌లో సూచించారు. వైదిక సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకున్నారు. వీటన్నింటి తర్వాత తుది ప్లాన్‌ను ఇటీవలే కలెక్టర్ ఫైనల్ చేయగా దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు చేరింది. దీనిపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. అధికారులు, వైదిక సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ప్లాన్‌పై సమగ్ర అవగాహనకు వచ్చారు. కాగా దేవాదాయ శాఖ అందించిన నివేదిక ప్రకారం మూడు విడతలుగా రూ.350 కోట్లతో అభివృద్ధి చేసేందుకు గతంలో ప్రతిపాదించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్లాన్‌ను ఆమోదిస్తే బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఇతర అంశాలపై స్పష్టత రానుంది.
సిద్ధమైన రామాలయ మాస్టర్ ప్లాన్ నమూనా
అభివృద్ధికి ప్లాన్ !


