ఏరులై పారింది!
బెల్టు షాపుల జోరు
● గత ఏడాది రూ.2,238 కోట్ల విలువైన మద్యం సేల్స్ ● అత్యధికంగా డిసెంబర్‌లో రూ.277 కోట్లు
పాల్వంచరూరల్/వైరా : అంతకుముందు ఏడాదితో పోలిస్తే మద్యం అమ్మకాలు కాస్త తగ్గినా 2025లో గణనీయమైన స్థితిలోనే నమోదు కావడం విశేషం. కొత్త ఎకై ్సజ్ పాలసీ డిసెంబర్ 1న అందుబాటులోకి రావడం, ఆ వెంటనే గ్రామపంచాయతీ ఎన్నికలు.. ఆ తర్వాత నూతన సంవత్సర వేడుకలు జరగడంతో అటు ప్రభుత్వానికి, ఇటు వ్యాపారులకు కలిసొచ్చింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు వైరాలోని ఐఎంఎల్ డిపో నుంచి రూ.2,238 కోట్ల విలువైన మద్యాన్ని వ్యాపారులు తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలోని 204 వైన్స్, 52 బార్లు, మూడు క్లబ్‌లకు ఈ మద్యం సరఫరా అయింది. డిసెంబర్‌లోనే అత్యధికంగా రూ.277 కోట్ల మద్యం అమ్మకాలు సాగగా, రోజుల వారీగా పరిశీలిస్తే మార్చి 29న రూ.25.85 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
కొంత తగ్గినా..
2024తో పోలిస్తే 2025లో మద్యం అమ్మకాలు కాస్త తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రూ.2,308 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. కానీ 2025లో ఇది రూ.70కోట్ల మేర తగ్గి రూ.2,238 కోట్లుగా నమోదైంది. అయితే, అమ్మకాలు తగ్గడానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని తెలుస్తోంది. అక్కడి కూటమి ప్రభుత్వం అంతకుముందు సర్కారు తీరుకు భిన్నంగా మద్యం అమ్మకాలు పెంచేలా అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీకి సరిహద్దుగా ఉండే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాల వైన్స్‌లో అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు.
మద్యం అమ్మకాల్లో ‘నయా’ జోష్
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలో ఒక్కరోజే రూ.13 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. బుధవారం రాత్రి, గురువారం జిల్లాలోని మద్యం షాపులన్నీ సందడిగా మారాయి. వైన్స్‌తో పాటు గ్రామాల్లోని బెల్ట్ దుకాణాల్లోనూ మందుబాబుల కోలాహలం నెలకొంది. ఎకై ్సజ్ శాఖ గణాంకాల ప్రకారం డిసెంబర్ నెలకు సంబంధించి ఇల్లెందులో రూ.17.8 కోట్లు, పాల్వంచలో రూ.17.50 కోట్లు, కొత్తగూడెంలో రూ.24.70 కోట్లు, మణుగూరులో రూ.14.70 కోట్లు, అశ్వారావుపేటలో రూ.11.50 కోట్లు, భద్రాచలంలో రూ.18.72 కోట్ల విలువైన మద్యం విక్రయించినట్లు ఎకై ్సజ్ అధికారులు వెల్లడించారు. 2024 డిసెంబర్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.92.75 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, 2025 డిసెంబర్‌లో రూ.105 కోట్ల వ్యాపారం జరిగిందని ఎకై ్సజ్ ఎస్‌ఈ జానయ్య వివరించారు.
ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని వైన్స్‌ల నుంచి బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా అవుతోంది. వైన్స్ నిర్వాహకులు బెల్ట్ షాపుల వారికి ధర పెంచడమే కాక ప్రత్యేక లేబుళ్ల ఆధారంగా మద్యాన్ని బహిరంగంగానే తరలిస్తున్నారు. ధర ఎక్కువ ఉందని బెల్టు షాపుల నిర్వాహకులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా పర్యవేక్షణకు ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటుచేయడంతో వైన్స్‌లో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఏరులై పారింది!


