అందుబాటులో ‘ముసాయిదా’
ఓటర్ల జాబితాలు విడుదల చేసిన మున్సిపల్ అధికారులు
మణుగూరు మినహా పట్టణ ఓటర్లు 1,85,750
కొత్తగూడెంఅర్బన్/ఇల్లెందు/అశ్వారావుపేటరూరల్ : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో స్థానిక అధికారులు ముసాయిదా ఓటరు జాబితాలోను గురువారం ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిద్ధం చేసిన జాబితాలను ప్రజల పరిశీలనార్థం ఆయా కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందుబాటులో ఉంచారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో మహిళా ఓటర్లు 70,503, పురుషులు 64,590, ఇతరులు 30.. మొత్తం 1,35,123 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషనర్ సుజాత ప్రకటించారు. జాబితాలో అభ్యంతరాలు ఉంటే తమకు అందజేయాలని సూచించారు. నిబంధనల మేరకు ఫిర్యాదులను పరిశీలించాక తుది ఓటరు జాబితాలు విడుదల చేస్తామని చెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున ఆయా కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా ప్రకటించడం లేదని వెల్లడించారు.
ఇల్లెందులో 33,777 మంది..
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో 33,777 మంది ఓటర్లు ఉన్నారని కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. మొత్తం 24 వార్డులకు గాను ఒక్కో చోట అత్యధికంగా 1,608 మంది, అతి తక్కువగా 1,232 మంది ఉన్నారని ప్రకటించారు. ఇక మొత్తంగా మహిళా ఓటర్లు 17,523, పురుషులు 16,250, ఇతరులు నలుగురు ఉన్నారని వెల్లడించారు. ముసాయిదా ఓటర్ల జాబితా మున్సిపల్ కార్యాలయంలో అందుబాటులో ఉంటుందని అభ్యంతరాలుంటే తమ దృష్టికి తేవాలని కోరారు.
‘పేట’లో 22 వార్డులు..
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాను కమిషనర్ బానోతు నాగరాజు గురువారం విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను మహిళా ఓటర్లు 8,762 మంది, పురుషులు 8,084, ఇతరులు నలుగురు.. మొత్తం 16,850 మంది ఓటర్లు ఉన్నారని ప్రకటించారు. ఈ జాబితాపై అభ్యంతరాలుంటే తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు.


