పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వేభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. కాగా, పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం చండీహోమం నిర్వహించనున్నట్లు ఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్ర నామాలు నమోదు చేసుకోవాలని, వివరాలకు 63034 08458 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
స్వల్పంగా పెరిగిన
పామాయిల్ గెలల ధర
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర స్వల్పంగా పెరగడంతో సాగుదారులకు కొంత ఊరట లభించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పామాయిల్ టన్ను ధరను రూ.19,694గా నిర్ణయించారు. ప్రస్తుతం టన్ను ధర రూ.19,598 ఉండగా, తాజాగా టన్నుకు రూ.96 పెంచినట్లు ఆయిల్‌ఫెడ్ ఉన్నతాధికారులు తెలిపారు.
కిన్నెరసానిలో
‘నూతన’ సందడి
పాల్వంచరూరల్ : నూతన సంవత్సరం సందర్భంగా కిన్నెరసానికి గురువారం పర్యాటకులు పోటెత్తారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. మొత్తం 1,170 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.64,245, 400 మంది బోటుషికారు చేయడం ద్వారా పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.20,670 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: గిరిజనుల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్‌లో గురువారం అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2026లో గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనలు మరింతగా మెరుగు పర్చాలని సూచించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం టీఎన్జీవోస్, ఉపాధ్యాయ సంఘాల క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడీ అశోక్, ఈఈ మధుకర్, ఆర్సీఓ అరుణకుమారి, ఏడీఎంహెచ్‌ఓ తుకారం నాయక్, సర్పంచ్ పూనెం కృష్ణదొర పాల్గొన్నారు.
గురుకుల ప్రవేశాలకు
దరఖాస్తుల ఆహ్వానం
చుంచుపల్లి: జిల్లాలోని పలు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో 5 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 22న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.విద్యాచందన తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన


