వైభవంగా రాపత్తు సేవ
గోవిందరాజస్వామి సన్నిధిలో
ప్రత్యేక పూజలు
భద్రాచలం : శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి గోకుల మండపంలోని శ్రీకృష్ణాలయంలో గురువారం వైభవంగా రాపత్తు సేవ నిర్వహించారు. తొలుత మంగళవాయిద్యాలు, భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ రామయ్యను తాతగుడి సెంటర్‌లోని గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించగా.. భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు.
మూలమూర్తులకు అభిషేకం..
దేవస్థానంలో మూలమూర్తులకు అభిషేకం జరిపారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నూతన సంవత్సరం కావడంతో భక్తులు స్వామి వారిని భారీగా దర్శించుకున్నారు.
పెరిగిన భక్తుల రాక
ప్రతి ఏడాది శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. 2024లో డిసెంబర్‌లో 2.43 లక్షల మంది దర్శించుకోగా 2025 డిసెంబర్‌లో ఆ సంఖ్య 2.70 లక్షలుగా నమోదు కావడం విశేషం.


