రామకోటితో పుణ్యఫలం
గోదావరిలో నిమజ్జనం..
ప్రతి ఏడాది గోదావరిలో నిమజ్జనం
రామాలయ ప్రాంగణలో పుస్తకాలు లభ్యం
ఆన్‌లైన్ చెల్లింపుతోనూ అందుబాటులో..
భద్రాచలం : ‘ఓ రామ..నీ నామమెంతో రుచి..రా’ అంటూ భక్త రామదాసు రామనామాన్ని వేన్నోళ్ల కొనియాడాడు. లోకంలోని అన్ని సుఖాల కంటే శ్రీరామ నామస్మరణ మేలు చేస్తుందని భక్త రామదాసు నాడు చెప్పగా, దాన్నే ఇప్పటికీ ఎంతో మంది ఆచరిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యత, ఆధ్యాత్మికతను పంచే నామాన్ని ‘శ్రీరామ’ అంటూ భక్తి శ్రద్దలతో కోటిసార్లు లిఖిస్తుంటారు. దీనినే రామకోటిగా భక్తులు పిలుస్తారు. రామకోటి రాస్తే సర్వేంద్రియాలు అదుపులో ఉంటాయని, ఇలా రాసిన రామకోటిని భద్రగిరిలో సమర్పిస్తే ఫుణ్యఫలమని భక్తుల నమ్మకం.
పుస్తకం ధర రూ.60..
రామకోటిని కొందరు భక్తులు తమ ఇళ్లలో ఉండే పుస్తకాల్లోనే లిఖిస్తుంటారు. అలా కాకుండా లెక్క ప్రకారం కోటి గడులు ఉండే రామకోటి పుస్తకాలు భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ప్రాంగణంలోని దుకాణాల్లో లభ్యమవుతాయి. ఒక్కో పుస్తకాన్ని రూ. 60 చొప్పున కొనుగోలు చేయొచ్చు. అయితే దూర ప్రాంతాల్లో ఉంటూ నేరుగా కొనుగోలు చేయలేని వారు తమ చిరునామా అందిస్తే నిస్వార్థ సేవకులు కొందరు రిజిస్టర్ పోస్టు ద్వారా వారికి అందజేస్తున్నారు. దీనికి తపాలా ఖర్చులు రూ.42, పుస్తకాన్ని పంపేందుకు అవసరమైన క్లాత్ కవర్ రూ.10.. మొత్తంగా భక్తులు రూ.112 చెల్లిస్తే రామకోటి పుస్తకాలు ఇంటి ముంగిటకే వస్తాయి. ఈ సేవలకు పాల్వంచకు చెందిన ఓ భక్తుడు ఉచితంగా అందిస్తున్నాడు. అవసరమైన వారు 81870 82498 నంబర్‌లో సంప్రదించవచ్చు.
రామ అంటే సర్వపాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాక వెయ్యిసార్లు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే వచ్చే పుణ్యం ఒక్కసారి రామ అంటే వస్తుందని పలువురి నమ్మకం. అందుకే భక్తులు ఏ పని అయినా శ్రీరామ నామస్మరణతోనే ప్రారంభిస్తారు. భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను భద్రగిరిలో అందిస్తే రామయ్య కరుణాకటాక్షాలు లభిస్తాయి.
– కోటి శ్రీమన్నారాయణాచార్యులు,
రామాలయ ఉప ప్రధానార్చకులు
భక్తులు రాసిన రామకోటిని ఎక్కువ మంది భద్రాచలంలో, ఇంతదూరం రాలేని వారు సమీప రామాలయాల్లో సమర్పిస్తారు. మరి కొందరు ఇతరులతో భద్రగిరికి పంపిస్తుంటారు. ఈ పుస్తకాలను తొలుత ఆలయ ప్రదక్షిణ చేశాక అంతరాలయంలో మూలమూర్తుల పాదాల చెంతన ఉంచి పూజలు చేస్తారు. అనంతరం వాటిని ప్రత్యేక గదిలో భద్రపరిచి ఆగస్టులో పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. రామ ప్రచార రథంతో స్వామి వారి ఉత్సవమూర్తులతో పాటు ఈ పుస్తకాలను గోదావరికి తీసుకెళ్లి అర్చకులు గోదావరి మాతకు పూజలు చేసి పసుపు, కుంకుమ, వస్త్రాలు సమర్పించాక రామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. కొన్ని పుస్తకాలను రామాలయం ప్రాంగణంలోని పొగడ చెట్టు వద్ద గల రామకోటి స్తూపాల్లోనూ నిక్షిప్తం చేస్తారు.
భద్రగిరిలో సమర్పణకు భక్తుల ఆసక్తి
రామకోటితో పుణ్యఫలం
రామకోటితో పుణ్యఫలం


