ఉర్సు వేడుకలు షురూ..
హజరత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్‌లో భక్తుల పూజలు
సందల్ సమర్పించిన మాలిక్
ఇల్లెందురూరల్ : కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు అమితంగా ఆరాధించే హజరత్ నాగుల్‌మీరా దర్గాహ్ మౌలా చాన్ చిల్లాలో బుధవారం ఉర్సు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భారీ సెట్టింగులతో అలంకరించిన దర్గా ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల ప్రారంభ సూచికగా పట్టణంలోని హజరత్ ఖాసీం దుల్హా దర్గాహ్ షరీఫ్‌లో ఖాసీం దుల్హాకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వాహనంలో సందల్‌ను ఊరేగింపుగా తరలించారు. సుమారు ఏడు కిలోమీటర్లు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి సత్యనారాయణపురం అటవీ ప్రాంతంలోని హజరత్ నాగుల్‌మీరా దర్గాకు చేరుకున్నారు. అక్కడ సందల్‌కు దర్గా మాలిక్ లక్ష్మీనారాయణ, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయం ప్రకారం మేళతాలాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి హజరత్ నాగుల్ మీరా మౌలా చాన్‌కు గంధం (సందల్)ను సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.


