ఇందిరమ్మచీరలు సిద్ధం
● జిల్లాలో నేటి నుంచి పంపిణీ ● మొదట గ్రామీణ ప్రాంత మహిళలకు.. ● జిల్లాకు చేరుకున్న 1,44,415 చీరలు
చుంచుపల్లి : అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా.. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో గురువారం నుంచి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదట గ్రామీణ ప్రాంత మహిళా సంఘాల సభ్యులకు అందించేందుకు సెర్ప్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ తర్వాత పట్టణ ప్రాంతాల మహిళలకు అందజేస్తారు.
పంపిణీకి సిద్ధంగా చీరలు..
ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా అర్హులైన మహిళలకు చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. బతుకమ్మ పండుగ నాటికే పంపిణీ చేయాలని భావించినా అప్పుడు చీరలు సిద్ధం కాకపోవడంతో వాయిదా వేసింది. మొదట రెండు చొప్పున చీరలు అందించాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుతం ఒకటి చొప్పునే పంపిణీ చేసేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం మెప్మా ద్వారా పురపాలక సంఘాల పరిధిలోని మహిళ ల వివరాలు, సెర్ప్ అధికారులు గ్రామీణ ప్రాంత సభ్యుల వివరాలు సేకరించారు. జిల్లాలోని మున్సిపాలిటీలు, 471 గ్రామ పంచాయతీల పరిధిలో 2,13,367 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సెర్ప్ పరిధిలో 1,82,454 మంది, మెప్మా పరిధిలో 30,913 మంది మహిళలు ఉన్నారు. జిల్లాకు వచ్చిన ఇందిరమ్మ చీరలను కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేటలోని గోదాముల్లో నిల్వ చేయగా.. ఒక్కో గోదాం పర్యవేక్షణ బాధ్యతను ఒక అధికారికి అప్పగించారు. జిల్లాలో గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 8 వరకు పట్టణ ప్రాంత మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈసారి చీరల నాణ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, ఒక్కో చీర విలువ రూ.800 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన మహిళలకు చీరల పంపిణీకి ఏర్పాట్లు చేశాం. ప్రస్తుతం గోదాముల్లో నిల్వ చేయగా మండలాలకు తరలించే పనిలో సెర్ప్ సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాకు 1,44,415 ఇందిరమ్మ చీరలు చేరుకున్నాయి. వివిధ మహిళా సంఘాల ద్వారా సభ్యులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.విద్యాచందన, డీఆర్‌డీఓ


