నాణ్యమైన బోధన అందించాలి
సుజాతనగర్/జూలూరుపాడు : పాఠశాలలను పరిశుభ్రంగా, ఆహ్లాదభరితంగా ఉంచడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ కె. వెంకటనర్సమ్మ అన్నారు. బుధవారం ఆమె సుజాతనగర్, జూలూరుపాడు మండలాల్లో పలు పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ప్రణాళికాయుతంగా చదువుకోవాలని సూచించారు. చదువుపై శ్రద్ధ పెట్టాలని, తల్లిదండ్రుల ఆశలను నెరరేర్చాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సంసిద్ధులను చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో తరగతి గదులు, మధ్యాహ్న భోజనం, తాగునీటి సౌకర్యం వంటి వసతులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో సీఎంఐఈడీ కో ఆర్డినేటర్లు, సైదులు, నాగ రాజశేఖర్, సతీష్, సుజాతనగర్ ఎంఈఓ లీల, జూలూరుపాడు మండల నోడల్ అధికారి పి.సంజీవరావు, కాంప్లెక్స్ హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య, హెచ్‌ఎంలు పున్నమ్మ, బానోత్ నేతాజీ తదితరులు పాల్గొన్నారు.
నీట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పాల్వంచ: పాల్వంచలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(నీట్ కోచింగ్)కు ఎంపికై ందని, దీనిని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు భవిష్యత్‌లో ఉత్తమ డాక్టర్లుగా ఎదగాలని వెంకటనర్సమ్మ అన్నారు. బుధవారం ఆమె కళాశాలను తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారని, గతంతో పోలిస్తే ఇప్పుడు అనేక అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి తులసి తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ జేడీ వెంకటనర్సమ్మ


