భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ప్రజావాణికి స్వల్పంగా హాజరు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి స్వల్ప సంఖ్యలో ప్రజలు హాజరై సమస్యల పరిష్కారానికి వినతులు అందజేశారు. భారీ వర్షాలకు తోడు ప్రజావాణి కార్యక్రమాన్ని కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ స్థాయిలో తొలిసారిగా నిర్వహించే విషయంలో సరైన సమాచారం లేక తక్కువ సంఖ్యలో వచ్చారు. అనారోగ్యం కారణండా ఆర్డీఓ మధు సెలవులో ఉండగా, డీఏఓ శకుంతల ఫిర్యాదులు స్వీకరించారు.
పెరిగిన పామాయిల్ గెలల ధర
అశ్వారావుపేటరూరల్: పామాయిల్ గెలల టన్ను ధర మరోసారి పెరిగింది. సోమవారం హైదారాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులు నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వరకు టన్ను ధర రూ.18,052 ఉండగా, తాజాగా రూ.1,055 పెంచి రూ.19,107గా నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా జీఓ విడుదల చేయడంతో పామాయిల్ సాగుదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.
పట్టాలు లేవంటూ పత్తి పంట ధ్వంసం
పాల్వంచరూరల్ : ఇప్పుడుప్పుడే ఏపుగా ఎదుగుతున్న పత్తి పంటను వైల్డ్‌లైఫ్ అధికారులు ధ్వంసం చేయగా బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. మండల పరిధిలోని ఉల్వనూరు బంజర, చిరుతానిపాడు, మందెరలకపాడు గ్రామాల్లో ఆదివాసీ రైతులు పూనెం రమేష్, ఎర్రబోయిన చిట్టిబాబు, కాలం ఎర్రయ్య, సురేష్ పత్తి సాగు చేస్తుండగా.. ఆ భూములకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు లేవంటూ అటవీ అధికారులు మొక్కలను తొలగించారు. కాగా, తాము అధికారులను బతిమిలాడినా వినకుండా ధ్వంసం చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకుడు నిమ్మల రాంబాబు ప్రభుత్వాన్ని కోరారు. పోడు సాగుదారులపై అటవీ అధికారుల దాడులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు చాతకొండ రేంజ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వేములపల్లి శ్రీనివాసరావు, సంజీవరావు, రామారావు, మడకం కృష్ణ, పద్దం దేవయ్య, పదం భీమా, తాటిలక్ష్మయ్య, మడకం ప్రసాద్ పాల్గొన్నారు.
కిన్నెరసాని మూడు గేట్లు ఎత్తివేత
పాల్వంచరూరల్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశ యానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల ఈ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 10,600 క్యూసెక్కుల వరద రావడంతో సోమవారం నీటిమట్టం 405.80 అడుగులకు పెరిగింది. దీంతో మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు.