
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, దేవస్థానంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన భాస్కర్‌రామ్ రూ.2లక్షల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోగా, అధికారులు ఆయనకు ప్రసాదం, స్వామివారి జ్ఞాపిక అందజేశారు.
అధికారుల ఆట విడుపు !
టెన్నిస్ ఆడిన ఐటీడీఏ పీఓ,
హౌసింగ్ ఎండీ
పాల్వంచరూరల్ : నిత్యం విధి నిర్వహణలో బిజీగా గడిపే ఇద్దరు ఐఏఎస్ అధికారులు అటవిడుపుగా కాసేపు టెన్నిస్ ఆడారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వి.పి.గౌతమ్ చండ్రుగొండ మండలం బెండలపాడులో సీఎం రేవంత్‌రెడ్డి సభా కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో పాల్వంచ శ్రీనివాసకాలనీలోని మినీ స్టేడియం వద్ద ఆగారు. బుధవారం రాత్రి కొందరు టెన్నిస్ ఆడుతుండగా వారు కూడా సరదాగా కాసేపు లాన్ టెన్నిస్ ఆడారు. వారి వెంట టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ ఉన్నారు.
మళ్లీ ‘మొదటి’కొచ్చిన గోదావరి
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద
హెచ్చరిక జారీ
భద్రాచలంటౌన్ : భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వదర నీరు భారీగా వస్తుండగా బుధవారం రాత్రి 9.50 గంటలకు నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 11 గంటలకు 43.30 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. బుధవారం ఉదయం 9 గంటల వరకు తగ్గుతూ వచ్చిన నీటి ప్రవాహం సాయంత్రానికి ఒక్కసారిగా పెరిగింది. మరోసారి గోదావరి ఉప్పొంగుతుండడంతో ఏజెన్సీ వాసుల్లో భయం పట్టుకుంది. కాగా, ఈ వర్షాకాలం సీజన్‌లో ఇప్పటివరకు మూడు సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక, రెండుసార్లు రెండో ప్రమాద హెచ్చరిక జారీ కావడం గమనార్హం.

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం