
భవిష్యత్‌కు బలమైన పునాది !
చిన్నారులకు త్వరలో ప్రీప్రైమరీ తరగతులు
తొలివిడతగా జిల్లాలోని 21 పాఠశాలల్లో అమలు
టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్
నాలుగేళ్లు పైబడిన వారికి అడ్మిషన్లు..
ఒక్కో పాఠశాలకు రూ.1.70 లక్షలు..
కొత్తగూడెంఅర్బన్: నాలుగేళ్లు పైబడిన చిన్నారుల భవిష్యత్‌కు బలమైన పునాది వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బోధించే ఎల్‌కేజీ, యూకేజీ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ (పూర్వ ప్రాథమిక విద్య) తరగతులు అందుబాటులోనికి రానున్నాయి. రూ.వేల ఫీజులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలలకు పంపించలేని తల్లిదండ్రులకు ఇదో వరంలా మారనుంది. జిల్లాలోని 21 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ ఏడాది నుంచే తరగతుల ప్రారంభానికి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చిన్నారుల విద్యాబోధనకు గాను ప్రత్యేకంగా టీచర్లు, ఆయాల నియామకానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 18 – 44 ఏళ్ల వయసు గల స్థానిక మహిళలే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బోధకుల కనీస విద్యార్హత ఇంటర్‌మీడియట్‌గా, ఆయాలకు ఏడో తరగతిగా నిర్ణయించారు. వారి ఎంపిక కమిటీకి కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా, అదనపు కలెక్టర్(రెవెన్యూ)తో పాటు కలెక్టర్ నామినేట్ చేసిన మరొకరు సభ్యులుగా ఉంటారు. బోధకులకు నెలకు రూ.8వేలు, ఆయాలకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం పది నెలల పాటు చెల్లించనున్నారు.
ఎంపికై న పాఠశాలలివే..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు తొలి విడతగా 21 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో ఆళ్లపల్లితో పాటు మండలంలోని పాతూరు ఎంపీపీఎస్, అశ్వారావుపేట మండలం కుడుములపాడు, ఐవీ ఎంప్లాయ్ కాలనీ, చండ్రుగొండ మండలం పోకలగూడెం, చర్ల మండలం పూసుగుప్ప, దమ్మపేట మండలం బాలరాజుగూడెం, దుమ్ముగూడెం మండలం గోవిందాపురం కాలనీ, గుండాల మండలం కొడవటంచ, జూలూరుపాడు మండలం కాకర్ల, లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమల్ల, మణుగూరు మండలం మామిడితోట గుంపు, పినపాక మండలం గోవిందాపురం, పాండురంగాపురం, ఉప్పాక, సింగిరెడ్డిపల్లి, టేకులపల్లి మండలం బేతంపూడి, తడికలపూడి స్టేషన్, రామచంద్రునిపేట, కొప్పురాయి, ఇల్లెందు మండలం రొంపేడు ఎంపీపీఎస్‌లు ఉన్నాయి.
ఇప్పటివరకు ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లించే విద్యార్థులకు మాత్రమే ప్రీప్రైమరీ క్లాసులు వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి రావడంతో పేద పిల్లలకు లబ్ధి చేకూరనుంది. చిన్నారులు ఆట, పాటలతో సరదాగా నేర్చుకునేలా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ తరగతులతో పిల్లల విద్యా పునాది బలపడటమే కాక సర్కారు స్కూళ్లలో అడ్మిషన్లు పెరగనున్నాయి. – నాగలక్ష్మి, డీఈఓ
నాలుగేళ్లు నిండిన చిన్నారులకు మాత్రమే ఇందులో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. బోధనకు ఎల్‌కేజీ, యూకేజీ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ ప్రక్రియ ఆలస్యమైతే సంబంధిత మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని బోధన సాగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు ఆటపాటలతో కూడిన బోధన అందించనున్నారు. పిల్లలకు మధ్యాహ్న భోజనంతో పాటు గంట సేపు నిద్రించేందుకు కూడా సమయం కేటాయించారు. ఎంపికై న పాఠశాలలకు రూ.1.70 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇందులో రూ.1.50 లక్షలు ఫర్నిచర్, పెయింటింగ్, బోధన పరికరాలు, ఇతర వస్తువుల కోసం ఖర్చు చేయనున్నారు. మిగితా రూ.20 వేలతో విద్యార్థులకు బూట్లు, యూనిఫామ్ కొనుగోలు చేస్తారు. 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలకు అదనపు నిధులు మంజూరు చేస్తారు.

భవిష్యత్‌కు బలమైన పునాది !