
యూరియా పంపిణీలో ఇంత నిర్లక్ష్యమా ?
జూలూరుపాడు: యూరియా సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమకు సరిపడా పంపిణీ చేయాలని కోరుతూ జూలూరుపాడు పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు బుధవారం ఆందోళన చేశారు. కార్యాలయం లోపలికి వచ్చి షెట్టర్ మూసి అధికారులు, సిబ్బందిని నిర్భందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక్కో రైతుకు మూడు బస్తాల యూరియా ఇవ్వాలని, ఒక బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. యూరియా కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని కార్యాలయ షెట్టర్‌ను తీశారు. రైతులు సంయమనం పాటించాలని సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. ఆ తర్వాత రైతులకు ఒక్కో యూరియా బస్తా చొప్పున పంపిణీ చేశారు. సొసైటీ కార్యదర్శి రమణారెడ్డి మాట్లాడుతూ రోజుకు 40 టన్నుల యూరియా అవసరమని ఇండెంట్ పెట్టామని, 10 టన్నులు మాత్రమే వస్తుండటంతో ప్రతీ రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇస్తున్నామని తెలిపారు.