
పేదల ఆత్మగౌరవమే లక్ష్యం
సంక్షేమానికి మారుపేరు వైఎస్సార్
● ఎంత ఖర్చయినా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ● మంత్రి పొంగులేటి వెల్లడి
వరుణుడు కరుణించాడు..
ములకలపల్లి : సీఎం సభకు వరుణదేవుడు కరుణించాడు, మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురవగా సభా ప్రాంగణం బురదమయం కావడం, రహదారులన్నీ చిత్తడిగా మారడంతో అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం ఉదయం కూడా చిరుజల్లులు కురిసి, కారుమబ్బులు కమ్ముకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే రెండు పర్యాయాలు కార్యక్రమం వాయిదా పడగా మరోసారి కూడా ఏం జరుగుతుందోనని భయపడ్డారు. అయితే సభ సమయానికి వాతావరణం అనుకూలించడంతో సభ విజయవంతమైంది. బెండాలపాడులో గృహప్రవేశ సమయంలో రేవంత్‌రెడ్డి లబ్ధిదారులతో మాట్లాడుతూ చిరుజల్లులు కురిసినా, వెంటనే నిలిచిపోయాయని, భవవంతుడి ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఫలించిన ‘ఖాకీ’ల శ్రమ
సీఎం సభకు 1,200 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేకుండా సభ విజయవంతం కావడంతో ఖాకీల శ్రమ ఫలించినట్ట యింది. భారీగా బస్సులు వచ్చినా, నిర్ణీత ప్రదేశాలకు తరలించారు. పెద్దగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త వహించారు.
అశ్వారావుపేట: రాష్ట్రంలో పేదల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చండ్రుగొండ మండలం దామరచర్లలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదవాడిని చీడపురుగులా చూసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరమే రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వచ్చే రెండున్నరేళ్లలో మరో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి 25వేల ఇళ్లు అదనంగా కేటాయిస్తామన్నారు. తాము పదవులు అడగలేదని, సీఎం రేవంత్‌రెడ్డి పిలిచి పదవులివ్వడంతో పాటు ఆడపడుచులకు ఇళ్లు ఇవ్వడమే కాక స్వయంగా జిల్లాకు వచ్చి శంకుస్థాపనలు, గృహప్రవేశాలు చేశారని వివరించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నాడు దివంగత ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే, నేడు రేవంత్‌రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చారని అన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని బతికించి అధికారంలోకి తెచ్చిన టైగర్ రేవంత్ రెడ్డి అని కొనియాడారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పేదవాడి సొంతింటి కల నెరవేరిన రోజిది అన్నారు. భద్రాచలం, ఇల్లెందు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు ఈ జిల్లాలోనే చేయడం హర్షణీయమని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ఈ రోజు తన జన్మలో మరిచిపోలేనిదని అన్నారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు కార్యక్రమం రెండుసార్లు వాయిదా పడినా.. మూడోసారి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొట్లాడాలన్నా.. పోరాడాలన్నా.. నిప్పుకణికల్లా ఆందోళన చేయాలన్నా తమకు సాటి రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఆయనతో కలిసి ఉన్నామని చెప్పారు. సీతారామ నీళ్లు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు వచ్చేలా చూడాలని, కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. నాడు వైఎస్సార్ భద్రాచలంలో పోడు పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారని.. నాటి, నేటి సీఎంలకు సారూప్యత ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరామ్‌నాయక్, సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ మాలోతు రాందాస్‌నాయక్, గృహ నిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ట్రెయినీ ఐఏఎస్ సౌరభ్‌శర్మ, హౌసింగ్ పీడీ రవీంద్రనాథ్, ఐడీసీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్‌లు వేణుగోపాల్, విద్యాచందన, భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఎస్పీ రోహిత్‌రాజు, దిశ కమిటీ సభ్యడు బొర్రా సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: దామరచర్లలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్న సభలో వక్తలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి నామస్మరణ చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించినప్పుడల్లా అభిమానులు, ప్రజలు కేరింతలు కొట్టారు. సీఎం తన ప్రసంగంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. వైఎస్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా తమ ప్రసంగాల్లో వైఎస్సార్ పేరు ప్రస్తావించారు. ఆయన సంక్షేమ పథకాలను అమలు చేశారని కొనియాడే సమయాన ప్రజలు ఈలలు, చప్పట్లతో తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.