
స్వయం ఉపాఽఽధి వైపు మొగ్గు చూపాలి
భధ్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి పథకాల వైపు మొగ్గు చూపాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి ఆయన దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్ధిదారులు వాటి ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తుల్లో కొన్ని ఇలా..
అశ్వారావుపేట మండలం కేశప్పగూడెం గ్రామస్తులు సోలార్ ద్వారా కరెంట్ లైన్ ఇప్పించాలని, చండ్రుగొండ మండలం తిప్పనపల్లికి చెందిన కృష్ణవేణి ఫ్లోర్ మిల్‌కు రుణం మంజూరు చేయాలని, కరకగూడెం మండలానికి చెందిన అరుణ జీవనోపాధికి, మణుగూరు మండలానికి చెందిన బాబురావు చేనేత మగ్గాలు ఇప్పించాలని, బూర్గంపాడు మండలం శ్రీరాంపూర్ గ్రామస్తులు అంగన్‌వాడీ, జీపీఎస్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతులు అందించారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చేతికొస్తున్న పత్తి చేలను ధ్వంసం చేసిన అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యూడెమోక్రసీ నాయకులు కోరారు. దర్బార్‌లో ఏపీఓ డేవిడ్‌రాజ్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, గిరిజన సంక్షేమ ఈఈ హరీష్, అధికారులు సైదులు, సున్నం రాంబాబు, భాస్కర్, ఉదయ్‌కుమార్, ఆర్.లక్ష్మీనారాయణ, ఆదినారాయణ పాల్గొన్నారు. కాగా, భద్రాచలం సబ్ కలెక్టరేట్‌లో తొలిసారి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి గిరిజనులు భారీగా తరలివచ్చి సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. వాటిని సత్వరమే పరిష్కరించి న్యాయం జరిగేలా చూస్తామని సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ వారికి హామీ ఇచ్చారు.
సులభంగా అర్థమవుతుంది..
దమ్మపేట : విద్యా భోదనలో అభ్యసన సామగ్రి(టీఎల్‌ఎం)ని ఉపయోగిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని పార్కలగండి బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం టీఎల్‌ఎం మేళా ఏర్పాటుచేయగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై టీఎల్‌ఎం మెటీరియల్‌ను పరిశీలించి, వాటి పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. టీఎల్‌ఎం ద్వారా ఉపాధ్యాయుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందని అన్నారు. ఈ నెల 9న భద్రాచలం ఐటీడీఏ పరిధిలో టీఎల్‌ఎం మేళా నిర్వహించి, ఉత్తమ ఉపకరణాలను ఎంపిక చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓ చంద్రమోహన్, ఎంఈఓ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్