
సహజవనంలో సాంకేతిక సొబగులు
● రోప్‌వే ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశం ● అవకాశాలను పరిశీలించిన అధికారులు
ఇల్లెందురూరల్: సహజత్వం ఉట్టిపడేలా రూపుదిద్దుకున్న అటవీ శాఖ నేచర్ పార్క్‌లో సౌకర్యాల పెంపుపై కలెక్టర్ జితేష్ వి పాటిల్ దృష్టి సారించారు. పార్క్‌లో రంగురంగుల పూలు, సుగంధ పరిమళాలతో అహ్లాదం, పచ్చదనం, ఓపెన్ జిమ్ వంటి సౌకర్యాలు కల్పించి ఎక్కువ మంది సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. పర్వతాలు, లోయల వంటి ప్రాంతాలున్న చోట ఏర్పాటు చేసే రోప్‌వేను నేచర్ పార్క్‌లో సాంకేతిక సొబగులతో అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి, మైన్స్ ఏడీ దినేష్ స్థానిక అధికారులతో కలిసి సోమవారం పార్కును సందర్శించారు. వాచ్‌టవర్‌ను పరిశీలించారు. పార్క్ మధ్యలో ఉన్న గుట్టను ఆధారంగా చేసుకొని జిప్‌లైన్ రోలర్ కోర్టర్‌ను వంద మీటర్ల దూరం వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. జిప్‌లైన్ రోలర్ అనేది గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటూ ఒక కేబుల్‌పై అమర్చిన పుల్లీ ద్వారా ప్రయాణించే సస్పెన్షన్ రైడ్ అని చెప్పారు. సుమారు కిలోమీటరు పొడవుతో 15 నుంచి 50 అడుగుల ఎత్తులో చెట్ల మధ్య రోప్‌వే ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించామని చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామన్నారు. వారి వెంట తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ ధన్‌సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఎఫ్‌ఆర్‌ఓ చలపతిరావు ఉన్నారు.