
సీపీఎస్ రద్దు చేయాలని ధర్నా
టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో
భారీ మోటారు సైకిల్ ర్యాలీ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ టీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అంతకుముందు పాల్వంచ బస్టాండ్ సెంటర్ నుంచి ఐడీఓసీ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ అమరనేని రామారావు, సెక్రటరీ జనరల్ సంగెం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల, ప్రభుత్వ నిధులను షేర్‌మార్కెట్‌కు తరలిస్తూ నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల నాయకులు పాల్గొన్నారు.