
గోదావరి తగ్గుముఖం
భద్రాచలంటౌన్: భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టి సోమవారం రాత్రి 42 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు 24 గంటల్లో మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ఎగువ నుంచి వదర నీరు భారీగా రావడంతో గత రెండు రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ దాగుడుమూతలాడిన గోదావరి నీటి ప్రవాహం ఇటు ఏజన్సీవాసులతో పాటు అధికారులను కంగారు పెట్టించింది. ఆదివారం ఉదయం వరకు నిలకడగా ఉన్న నీటి ప్రవాహం చిన్నగా పెరుగుతూ 9 గంటలకు 48 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అ తర్వాత నాలుగు గంటల పాటు నిలకడగా ఉండి నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అలా సోమవారం రాత్రి 7.37 గంటలకు 42.90 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. దీంతో మూడు రోజులుగా భద్రాచలం – చర్ల మధ్యతో పాటు ఏజెన్సీలోని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు మళ్లీ ప్రారంభమయ్యాయి.