
వరదలతో వణుకు
ఇప్పటికే ఒకసారి నీటమునిగిన పంటలు ఎగువ ప్రాంతాల వరదతో మళ్లీ పెరుగుతున్న గోదావరి
ఎరువులు వేయలేకపోతున్నాం
రెండుసార్లు నీటమునిగింది
బూర్గంపాడు: పరీవాహక ప్రాంత రైతులను గోదావరి వరదలు వెంటాడుతున్నాయి. పది రోజుల క్రితం వచ్చిన వరదలకు వేల ఎకరాల్లో నీట మునిగి పంటలు దెబ్బతిన్నాయి. వరి, పత్తి, కూరగాయలు, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. గోదావరి వరద తగ్గటంతో రైతులు రెండోసారి పత్తి గింజలు వేసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వరినారు తెచ్చుకుని నాట్లు వేసుకున్నారు. ఇంతలోనే మళ్లీ గోదావరి వరద పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం భద్రాచలం వద్ద గోదావరి వరద 47.90 అడుగులకు పైగా పెరగటంతో లోతట్టు భూముల్లోకి వరదనీరు చేరింది. దీంతో రెండోసారి సాగు చేసిన పంటలు కూడా నీటమునుగుతున్నాయి. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఇంద్రావతి నుంచి కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్ట్‌ల నుంచి కూడా నీటిని గోదావరికి వదులుతున్నారు. కూనవరం వద్ద శబరి ఎగపోటుతో గోదావరి వరద కొంతమేర పెరుగుతోంది. దీంతో రైతులు మరింత చెందుతున్నారు. అయితే రెండు రోజులుగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు లేకపోవటం ఒకింత ఊరటనిచ్చినట్లయింది.
నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం
గోదావరి వరదలతో భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో ఎక్కువ నష్టం జరుగుతుంది. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక(43అడుగులు) దాటితే ఆయా మండలాల్లోని గోదావరి ఒడ్డున వ్యవసాయ భూముల్లోకి వరదనీరు చేరుతుంది. ఒక్కో అడుగు వరద పెరుగుతుంటే వందల ఎకరాల్లో పంట నీటమునుగుతుంది. రెండో ప్రమాదక హెచ్చరిక(48 అడుగులు) దాటితే వరద ముంపు ఎక్కువగా ఉంటుంది. రెవెన్యూ డివిజన్‌లో కొన్ని ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరుతుంది. మూడో ప్రమాద హెచ్చరిక(53 అడుగులకు) వరద చేరితే కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. సుమారు 4 వేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూముల్లోకి వరద చేరుతుంది. దీంతో పంట నష్టం మరింత పెరుగుతుంది. బూర్గంపాడు మండలంలోని పెదవాగు, దోమలవాగు, పులితేరువాగు, వెదుర్లవాగు, కిన్నెరసాని ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో గోదావరి 50 అడుగులకు చేరితే రెండువేల ఎకరాల వరకు పంటలు నీటమునుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరిసాగు చేస్తున్నారు. వరదలకు పంటనష్టం జరిగితే వెంటనే సాగు చేసేందుకు వరినారు దొరికే పరిస్థితి లేదు. మెట్టపంటలు వేయాలంటే యాసంగి వరి సాగుకు ఇబ్బందికరమవుతుంది. ఇప్పటికే పంటల సాగు ఆలస్యమైందని భావిస్తున్న రైతులను గోదావరి వరదలు మరింత అవస్థ పెడుతున్నాయి. సెప్టెంబర్ వచ్చినా పంటలు సాగు ఆలస్యమవుతుండటం దిగుబడులపై ప్రభావం చూపనుంది. ఖరీఫ్ వరి సాగు ఆలస్యమవుతుండటంతో రెండో పంట యాసంగి వరి సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద తీవ్రత పెరిగి పంటలు నీటమునిగితే వానాకాలం పంటల సాగు ఆపేసి రెండో పంట సాగుచేసుకునే ఆలోచనలో కొందరు రైతులు ఉన్నారు.
గోదావరి పరీవాహక రైతుల్లో ఆందోళన
పత్తి సాగు చేసి మూడు నెలలు కావస్తోంది. ఎరువులు వేద్దామంటే మళ్లీ గోదావరి కాసుకుని ఉంది. మందు వేశాక వరద వస్తే పంట పూర్తిగా దెబ్బతింటుంది. మందు వేయకపోతే అదును దాటిపోతోంది.
–చెంచలపు రాములు, రైతు, నాగినేనిప్రోలు
పది రోజుల క్రితం వచ్చిన గోదావరి వరదకు ఏడెకరాల వరి పంట నీటమునిగింది. ఇందులో రెండెకరాల పూర్తిగా దెబ్బతింది. శనివారం వచ్చిన వరదకు మళ్లీ మునిగింది. మళ్లీ వరినాటు వేయాలంటే నారు లేదు.
–యడమకంటి లింగారెడ్డి, రైతు, రెడ్డిపాలెం

వరదలతో వణుకు

వరదలతో వణుకు