
కొత్త కార్డులకు బియ్యం..
జిల్లా రేషన్‌కార్డు వివరాలు ఇలా..
● నేటి నుంచి రేషన్ దుకాణాల్లో పంపిణీ ● జిల్లాలో 20,084 నూతన కార్డులు మంజూరు ● 236 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంపు
కొత్తగూడెంఅర్బన్: వర్షాకాలం నేపథ్యంలో వరదలు వస్తే రేషన్‌షాపుల నుంచి బియ్యం తీసుకోవడం కష్టతరంగా మారవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ బియ్యం ముందస్తుగా ఒకేసారి అందజేసింది. మూడు నెలల తర్వాత మళ్లీ సోమవారం నుంచి రేషన్ షాపుల్లో బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గోదాంల నుంచి కొన్ని రేషన్‌షాపులకు బియ్యం చేరగా, మరికొన్ని దుకాణాలకు రేపటి లోగా చేరే అవకాశం ఉంది. నేటి నుంచే పంపిణీ కూడా ప్రారంభించనున్నారు. గత జూలైలో కొత్త రేషన్‌కార్డులు జారీ చేశారు. అదే క్రమంలో అనర్హులవంటూ 3,390 కార్డులను రద్దు చేశారు. గత మూడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 20,084 కొత్త కార్డులను జారీ చేయగా, 36,409 మంది లబ్ధిదారులు అదనంగా పెరిగారు. దీంతో సెప్టెంబర్‌లో 236 మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంచి పంపిణీ చేయనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. కొత్త కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాలు సైతం చేపడుతున్నట్లు వివరించారు. కాగా పలువురు అర్హులు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు.
కమీషన్ జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
బియ్యం పంపిణీ చేస్తున్నందుకు రేషన్ డీలర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా కమీషను చెల్లిస్తాయి. ఐదు నెలలుగా కమీషన్ చెల్లింపులు నిలిచిపోవడంతో సోమవారం నుంచి నిరసన తెలపాలని, రేషన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం శనివారం రాత్రి డీలర్ల అకౌంట్లలో కమీషన్ జమ చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ కూడా చెల్లించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది.
బ్లాక్ మార్కెట్‌కు తరలిందే అధికం
ప్రభుత్వం మూడు నెలలకు సంబంధించిన బియ్యం ఒకేసారి జూన్‌లో పంపిణీ చేసింది. మూడు నెలలవి ఒకేసారి ఇవ్వడంతో దొడ్డు బియ్యం వచ్చాయంటూ డీలర్లు.. షాపులో ఒక బస్తా దొడ్డు బియ్యం చూపడంతో లబ్ధిదారులు తీసుకోకుండానే వెనుదిరిగారు. డీలర్లు బియ్యానికి బదులు లబ్ధిదారులకు నగదు అందజేసినట్లు తెలుస్తోంది. అనంతరం సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో కిలోకు రూ.5 నుంచి రూ.7 వరకు చెల్లించి లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం కేజీకి రూ.10 కంటే ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సన్నబియ్యం పంపిణీ చేస్తున్నా దందా మారలేదనే ఆరోపణలు వస్తున్నాయి. బియ్యం బ్లాక్ మార్కెట్ తరలకుండా జిల్లా సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
జిల్లాలో కొత్త రేషన్‌కార్డులు మంజూరు కావడంతో ఈ నెల 236 ఎంటీఎస్ కోటా అదనంగా పెరిగింది. మూడు నెలల తర్వాత తిరిగి సోమవారం నుంచి రేషన్‌షాపుల్లో బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. గతంలో ఉన్న లబ్ధిదారులు, ప్రస్తుతం కొత్తగా మంజూరైన కార్డు లబ్ధిదారులు తీసుకెళ్లాలి.
–రుక్మిణి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
రేషన్‌షాపులు 443
ఆహారభద్రత 2,72,112
అంత్యోదయ 21,148
అన్నపూర్ణ 03
మొత్తం 2,93,263
కొత్తగా మంజూరైనవి 20,084
ప్రతినెలా పంపిణీ 5,384.762
చేసే బియ్యం (మెట్రిక్ టన్నులు)

కొత్త కార్డులకు బియ్యం..