
47.90 అడుగులకు గోదావరి
భద్రాచలంఅర్బన్: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 47.90 అడుగులుగా నమోదైంది. ఆదివారం ఉదయం 8:54 గంటలకు వరద 48 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి ఆదివారం ఉదయం 4 గంటల వరకూ గోదావరి నీటిమట్టం 47.50 అడుగుల వద్ద నిలకడగా కొనసాగింది. అనంతరం 5 గంటల నుంచి స్వల్పంగా పెరుగుతూ 8:54 గంటలకు 48 అడుగులకు చేరింది. దాదాపు ఐదుగంటలపాటు నిలకడగా కొనసాగి, మధ్యాహ్నం 1:05 గంటలకు స్వల్పంగా తగ్గి 47.90 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. రాత్రి 8 గంటల వరకు కూడా గోదావరి నీటిమట్టం 47.90 అడుగుల వద్ద నిలకడగానే ఉంది. సోమవారం తెల్లవారు జామునుంచి భద్రాచలం వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఆగస్టు 20న ఒకే రోజు మొదటి, రెండో ప్రమాద హెచ్చరికలను దాటి గోదావరి వరద నీరు ప్రవహించింది. 21న 51.9 అడుగులకు చేరుకుని వరద తగ్గుముఖం పట్టింది.
భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగి
తగ్గిన నీటిమట్టం