
కలుపుమందు కలిసిన నీళ్లు తాగి అస్వస్థత
టేకులపల్లి: కలుపు మందు కలిసిన నీటిని తాగడంతో 15 మంది అస్వస్థతకు గురైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తొమ్మిదోమైలుతండాకు చెందిన రైతు జాటోతు రాజు ఆదివారం తన చేనులో మిర్చి నారు వేసేందుకు 14 మంది కూలీలను పిలిపించాడు.
పనిచేస్తున్న క్రమంలో కూలీలు తాగునీరు అడగటంతో రైతు అప్పటికే కలుపు మందు వాడిన బిందెలోనే తాగునీరు తీసుకుని వచ్చి తాను తాగడంతో పాటు కూలీలకు ఇచ్చాడు. ఆ నీటిని తాగిన కొంతసేపటికి తొలుత నూనావత్ అంజలి, జాటోతు జ్యోతి, ధరావత్ గాయత్రి, జాటోతు దేవి వాంతులు చేసుకుని కళ్లు తిరిగి కిందపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమవగా మిగతావారు కూడా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ నలుగురితో పాటు రైతు జాటోతు రాజు, కూలీలు జాటోత్ పార్వతి, ధరావతు సునీత, దరావత్ శంకర్, దారావత్ సంతు, ధారావత్ సింధు, ధారావతు సరోజ, జాటోతు సునీత, జాటోతు దళ్‌సింగ్, ఆంగోత్ పద్మ, జాటోతు బాలను స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు.
గణేశ్ శోభాయాత్రలో అపశ్రుతి
మణుగూరుటౌన్: గణేశ్ ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సాహంతో డీజే మోతలకు డాన్స్ చేస్తున్న మహిళ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి గుట్టమల్లారంలోని జయశంకర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో రాసమళ్ల ప్రమీల (45) డీజేను అనుకరిస్తూ నృత్యం చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడున్న వారు బాధితురాలిని స్థానిక 100 పడకల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు.
గంజాయి సేవిస్తున్న
ఇద్దరు అరెస్ట్
ఇల్లెందు: పట్టణంలోని ఇల్లెందు చెరువు కట్ట వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని ముత్తారపుకట్ట గ్రామానికి చెందిన పొడెగు సంపత్, మిట్టపల్లి దొనబండగుంపునకు చెందిన సూర్నపాక మహేశ్ గంజాయి సేవిస్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోటమైసమ్మ ఆలయం వద్ద పొడుగు వరుణ్ తమకు గంజాయి తాగటం అలవాటు చేశాడని వారు తెలిపారు. అయితే, పొడుగు వరుణ్‌కు జేకేకాలనీకి చెందిన ప్రవీణ్‌పాసీ గంజాయి సరఫరా చేసినట్లు తెలిపాడని అరెస్టయినవారు విచారణలో తెలిపారు.
యువకుడి అదృశ్యం
దుమ్ముగూడెం: మండలంలోని ములకపాడు గ్రామానికి చెందిన సిద్ధి రవికుమార్ 5 రోజులుగా కనిపించడం లేదని, దీనిపై కేసునమోదు చేశామని ఆదివా రం సీఐవెంకటప్పయ్య తెలిపారు. సిద్ధి రవికుమార్ గత ఆగస్ట్ 26వ తేదీ సాయంత్రం తన మిత్రుడు దాస రి ప్రశాంత్ ఇంటికి వెళ్లి, అక్కడే భోజనం చేసి బయటకు వెళ్లాడు. అప్పటి నుంచి తిరిగి రాలేదని, అతడికి అప్పుడప్పుడూ ఫిట్స్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. రవికుమార్ భార్య సిద్ధి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
ఆటో డ్రైవర్ అదృశ్యంపై
కేసు నమోదు
ఖమ్మంఅర్బన్: నగరంలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ అదృశ్యంపై ఆదివారం ఖమ్మంఅర్బన్( ఖానాపురం హవేలీ) పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్సార్ కాలనీలో నివసించే పొట్లపల్లి నారాయణ(45) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ఆటోతో ఇంటి నుంచి బయలుదేరాడు. అనంతరం తన భార్యకు ఫోన్ చేసి తన మనసు బాగోలేదని చెప్పి కాల్ కట్ చేశాడు. తిరిగి ఆమె ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. బంధువులతో కలిసి గాలించగా నగర శివారు ఎస్‌ఆర్ గార్డెన్స్ సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వ పక్కన ఆటో నిలిపి ఉంది. నారాయణ కనిపించకపోవడంతో భార్య మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
ఆటో బోల్తా
డ్రైవర్ మృతి
తిరుమలాయపాలెం: మండలంలోని మాదిరిపురం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించపోయి ఆటో బోల్తా కొట్టడంతో ఆటోడ్రైవర్ మృతిచెందిన ఘటనపై ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపూరం గ్రామానికి చెందిన చిర్రా నరేశ్ (29) శనివారం రాత్రి సమయంలో సుబ్లేడు అత్తగారింటికి తన సొంత ఆటోలో వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా ఆటో రోడ్డు పక్కకు పల్టీకొట్టింది. నరేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య రజిని కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కలుపుమందు కలిసిన నీళ్లు తాగి అస్వస్థత