● దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టు పాలన సాగిస్తున్నాయి ● ఓట్ల చోరీపై నేడు పాట్నాలో నిరసన ర్యాలీ ● సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్
ఖమ్మంమయూరిసెంటర్ : ఏకీకృత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర పన్నుతున్నాయని సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాగూర్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడు రోజుల పాటు ఖమ్మంలో మాస్‌లైన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, మతోన్మాదం పేరుతో సాగిస్తున్న హింస, ఓట్ల చోరీపై చర్చించామని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్నాయని, లౌకికతత్వాన్ని, సర్వమత సహజీవన సమాజాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆరోపించారు. బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) పేరుతో లక్షలాది మంది బలహీన వర్గాల వారి ఓటు హక్కు రద్దు చేశారని అన్నారు. దీనికి నిరసనగా నేడు(సోమవారం) పాట్నాలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా కార్మికులు, రైతులు, మహిళలు, దళితులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పత్తి దిగుమతిపై సుంకం రద్దును డిసెంబర్ 31 వరకు అమెరికా పొడిగించిందని, ఇది రైతులకు ప్రమాదకరమని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. వర్షాలు కురిసి పంటలు సాగు చేసే సమయంలో రైతుల కు యూరియా అందకుండా పోతోందని, యూరి యా సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో పంచాయతీలకు నిధులు మంజూరు కావడం లేదని, దీంతో గ్రామాల్లో సమస్యలు తాండవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి సుభాష్ దేవ్, కేంద్ర కమిటీ సభ్యులు దేవబ్రత శర్మ, కేజీ రామచందర్, కె.రమణ, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, ఉమాకాంత్, పూజారి కృష్ణ గోగోయ్, భిమల్ పాండే, వి.కృష్ణ, కె.సూర్యం, సి. భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.