
కిన్నెరసానిలో సండే సందడి
పాల్వంచరూరల్: మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు భారీగా పోటెత్తారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 448 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.20,835, 120 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.9,820 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సందర్శించిన ఖమ్మం జడ్జి..
కిన్నెరసాని రిజర్వాయర్‌ను ఖమ్మం జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. డీర్‌పార్కులో దుప్పులను, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు.
ఒక గేటు ఎత్తివేత..
ఎగువన కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలయాశానికి వరద ఉధృతి పెరిగింది. 407 అడుగుల నీటినిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 1000 క్యూసెక్కుల వరద రావడంతో ఆదివారం నీటిమట్టం 405.10 అడుగులకు పెరిగింది. దీంతో ఒక గేటు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసినట్లు ఏఈ తెలిపారు.
ఒకరోజు ఆదాయం రూ.30,655