
కుక్కలతో భయాందోళనలో ప్రజలు
అశ్వాపురం: మండలంలోని తుమ్మలచెరువులోపదిరోజులు గా కుక్కలు అర్ధరాత్రి ఇళ్లల్లోకి వచ్చి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి సమయాల్లో కుక్కలు మంచాల కింద చేరడం, పిల్లల పక్కన చేరు తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రంతా నిద్రాహారాలు మాని కంటి మీద కునుకు లేకుండా కర్రలు పట్టుకొని కుక్కలు ఇంట్లోకి రాకుండా కాపలా కాస్తున్నారు. అవి పిల్లలు, వృద్ధులను ఎక్కడ కరుస్తాయో నని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగక ముందే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
రైలుకింద పడి వృద్ధురాలు మృతి
ఎర్రుపాలెం: స్థానిక రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఓ వృద్ధురాలు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన మిద్దె మేరమ్మ (72) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం రైల్వేస్టేషన్‌కు చేరుకుని గూడ్సు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేశారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన బస్సు
ఖమ్మంఅర్బన్: నగర పరిధి లోని గోపాలపురం వద్ద ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టగా మహిళ మృతిచెందగా.. ఆమె భర్తకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి.. ఏన్కూరు మండలం కేసుపల్లి గ్రామానికి చెందిన పొలిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మి (45) దంపతులు ద్విచక్రవాహనంపై ఖమ్మం నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. గోపాలపురం వద్దకు రాగానే ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న భద్రాచలం డిపో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు బలమైన గాయం కావడంతో లక్ష్మి ఘటనా స్థలంలోనే మృతిచెందింది. గాయపడిన వెంకటేశ్వర్లును 108ద్వారా ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఖమ్మం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.