
అధ్వానం ఆశ్రమ పాఠశాల
టేకులపల్లి/సింగరేణి(కొత్తగూడెం): టేకులపల్లి మండలంలోని కోయగూడెం ఆశ్రమ పాఠశాల అధ్వానంగా మారిందని, హాస్టల్ వార్డెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ ఆరోపించారు. సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యార్థి పోరుబాట యాత్ర శుక్రవారం టేకులపల్లి మండలానికి చేరుకోగా శనివారం కోయగూడెం ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. హాస్టల్‌లో వెలుగుచూసిన సమస్యలను నాయకులు వెల్లడించారు. మరుగుదొడ్లు, వంట పాత్రలు, మంచినీటి ట్యాంకులు, విద్యార్థులు పడుకునే డార్మెంట్లు, డైనింగ్ హాల్, పాఠశాల ఆవరణం అధ్వానంగా ఉన్నాయని తెలిపారు. కట్టెలతో వంటచేసి, గ్యాస్ బండలు వాడినట్లు బిల్లులు పెట్టుకుంటున్నారని ఆరోపించారు. రెగ్యులర్ వర్కర్ల స్థానంలో కూలీలను ఏర్పాటు చేసుకొని వర్కర్ల నుంచి కూలీల నుంచి కమీషన్లు తీసుకుంటున్నారని, దీనిపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం యాత్ర కొత్తగూడెం చేరుకోగా పృథ్వీ మాట్లాడుతూ.. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరా రు. నాయకులు మునిగెల శివప్రశాంత్, బి.సాయి కుమార్, రామ్‌చరణ్, అబ్దుల్ గని, విష్ణువర్ధన్, జార్జ్, శ్రావణి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.